Hardik Pandya Injured: టీమిండియాకు హార్దిక్ పాండ్యా షాక్.. గాయంతో ఇన్నింగ్స్ మొత్తానికి దూరం.. బ్యాటింగ్ చేస్తాడా?
Hardik Pandya Injured: టీమిండియాకు హార్దిక్ పాండ్యా షాక్ తగిలింది. అతడు గాయంతో ఇన్నింగ్స్ మొత్తానికి దూరమయ్యాడు. పాండ్యా బ్యాటింగ్ అయినా చేస్తాడా లేదా అన్నది అనుమానంగా మారింది.
Hardik Pandya Injured: టీమిండియాకు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ లో గాయపడి బంగ్లాదేశ్ తో ఇన్నింగ్స్ మొత్తానికి దూరమయ్యాడు. తన బౌలింగ్ లో ఓ బౌండరీని ఆపబోయి పాండ్యా గాయపడ్డాడు. మైదానంలోనే అతనికి చాలాసేపు చికిత్స చేశారు. తర్వాత లేచి బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
దీంతో కేవలం రెండు బంతులు వేసి పాండ్యా బయటకు వెళ్లిపోయాడు. ఆ ఓవర్ ను విరాట్ కోహ్లి పూర్తి చేశాడు. గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లే సమయంలో హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. అతడు కాస్త కుంటుతూ నడవడం కనిపించింది. పాండ్యా బయటకు వెళ్లిన కాసేపటి తర్వాత అతడు మళ్లీ ఫీల్డింగ్ కు దిగబోడని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
అతడు బ్యాటింగ్ అయినా చేస్తాడా అన్నది తేలాల్సి ఉంది. తాంజిద్ హసన్ నేరుగా కొట్టిన బౌండరీని ఆపడానికి తన ఫాలోత్రూలో హార్దిక్ కాలును అడ్డుపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తన ఎడమ కాలిపై పడిపోయాడు. అలా పడిన వెంటనే పైకి లేవడానికి కూడా అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి చాలాసేపు చికిత్స చేశాడు.
అతడు లేచి నిలబడి బౌలింగ్ కు సిద్ధమైనా.. ఓ బంతి వేయడానికి ప్రయత్నించిన సమయంలో నొప్పి వేధించడంతో బయటకు వెళ్లిపోయాడు. ఆ ఓవర్లో మిగిలిన నాలుగు బంతులను కోహ్లి వేశాడు. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ కు దిగాడు. పాండ్యా గాయం తీవ్రత ఎంతో తేలాల్సి ఉంది. అయితే అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.