Greg Chappell: టీమిండియా మాజీ కోచ్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో చూడండి.. స్నేహితులు చందాలు వేసుకొని..
Greg Chappell: టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన అతన్ని ఆదుకోవడానికి ఫ్రెండ్స్ చందాలు వేసుకుంటుండటం గమనార్హం.
Greg Chappell: టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ గుర్తున్నాడా? సుమారు రెండు దశాబ్దాల కిందట సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో కోచ్ గా వచ్చి ఎన్నో వివాదాలకు, గంగూలీ కెప్టెన్సీ పోవడానికి కారణమైన చాపెల్.. ప్రస్తుతం ఆర్థికపరమైన కష్టాల్లో కూరుకుపోయాడు. అతన్ని ఆదుకోవడానికి స్నేహితులు ఆన్ లైన్లో విరాళాలు సేకరిస్తుండటం గమనార్హం.
గ్రెగ్ చాపెల్ దయనీయ స్థితి చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతోంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా గొప్ప కెప్టెన్లలో ఒకడిగా, తర్వాత కోచ్ గా ఉన్న గ్రెగ్.. ఇప్పుడిలా అయిపోవడమేంటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. "నా పరిస్థితి దయనీయంగా ఉంది. మరీ అంత దారుణంగా ఏమీ లేదు. అలాగని లగ్జరీ కూడా లేదు. మేము క్రికెట్ ఆడాం కాబట్టి లగ్జరీ అనుభవిస్తామని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పటి క్రికెటర్లు అందుకున్నంత పెద్ద మొత్తాలు మేము అందుకోలేదు" అని చాపెల్ చెప్పాడు.
తానొక్కడినే ఇలా ఆర్థిక కష్టాలు అనుభవించడం లేదని, తన తరం క్రికెటర్లలో చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని చాపెల్ అన్నాడు. తన స్నేహితులు ఈ విషయం తెలుసుకొని సాయం చేస్తున్నట్లు తెలిపాడు. తాను క్రికెట్ ఆడిన కాలంలోని ప్లేయర్స్ చాలా మంది దయనీయ పరిస్థితుల్లోనే ఉన్నారని, అప్పట్లో తమకు ఇంత భారీగా చెల్లించేవారు కాదని చాపెల్ వెల్లడించాడు.
క్రికెట్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి తోడ్పడిన ప్లేయర్స్ ను గుర్తించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు చాపెల్ స్పష్టం చేశాడు. చాపెల్ కు ఆర్థిక సాయం కోసం అతని ఫ్రెండ్స్ GoFundMeలో ప్రత్యేకమైన పేజ్ మొదలుపెట్టారు. దీని ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.
1970, 80ల్లో చాపెల్ ఆస్ట్రేలియా తరఫున 87 టెస్టులు ఆడి 24 సెంచరీలు చేయడం విశేషం. ఆ టీమ్ కు అతడు కెప్టెన్ గానూ ఉన్నాడు. అయితే గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియాకు కోచ్ గా వచ్చిన గ్రెగ్ చాపెల్ ఎన్నో వివాదాలకు కారణమయ్యాడు. అతడు కోచ్ గా ఉన్న సమయంలో సెహ్వాగ్ తన సహజ శైలి కోల్పోయాడు. గంగూలీతో ఎప్పుడూ గొడవే. చివరికి అది దాదా కెప్టెన్సీ పోవడానికి కారణమైంది.