David Warner: టెస్టు ప్లేయర్‌గా మైదానంలో డేవిడ్ వార్నర్ చివరి క్షణాలు: వైరల్ అవుతున్న వీడియో-david warner signs off from test cricket his last movements as player on field is viral ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner: టెస్టు ప్లేయర్‌గా మైదానంలో డేవిడ్ వార్నర్ చివరి క్షణాలు: వైరల్ అవుతున్న వీడియో

David Warner: టెస్టు ప్లేయర్‌గా మైదానంలో డేవిడ్ వార్నర్ చివరి క్షణాలు: వైరల్ అవుతున్న వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 06, 2024 04:46 PM IST

David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. టెస్టు క్రికెట్‍కు గుడ్‍బై చెప్పాడు. అయితే, టెస్టు ఆటగాడిగా మైదానంలో అతడి చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్‍గా మారింది. ఆ వివరాలివే..

David Warner: టెస్టు ప్లేయర్‌గా మైదానంలో డేవిడ్ వార్నర్ చివరి క్షణాలు: వైరల్ అవుతున్న వీడియో
David Warner: టెస్టు ప్లేయర్‌గా మైదానంలో డేవిడ్ వార్నర్ చివరి క్షణాలు: వైరల్ అవుతున్న వీడియో (AFP)

David Warner: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, భీకర ఓపెనర్ డేవిడ్ వార్నర్.. టెస్టు కెరీర్ ముగిసింది. టెస్టు క్రికెట్‍కు అతడు వీడ్కోలు చెప్పేశాడు. తన చివరి టెస్టు కూడా ఆడేశాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‍తో నేడు (జనవరి 6) ముగిసిన మూడో మ్యాచ్‍తో వార్నర్ టెస్టు కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడింది. ఈ మూడో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో నాలుగు రోజుల్లోనే విజయం సాధించింది. 3-0తో సిరీస్‍ను కైవసం చేసుకొని డేవిడ్ వార్నర్‌కు టెస్టుల నుంచి ఘనమైన వీడ్కోలు పలికింది ఆసీస్. చివరి ఇన్నింగ్స్‌లోనూ అర్ధశకతం చేసి.. తన 13ఏళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‍బై చెప్పాడు డేవిడ్ వార్నర్. అయితే, టెస్టు క్రికెటర్‌గా మైదానంలో అతడి చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్‍గా మారింది. ఆ వివరాలివే..

పాకిస్థాన్‍తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా లక్ష్యఛేదన చేస్తున్న సమయంలో 25వ ఓవర్లో డేవిడ్ వార్నర్‌ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 25వ ఓవర్‌ను పాక్ బౌలర్ షాజిద్ ఖాన్ వేయగా.. ఐదో బంతి వార్నర్ ప్యాడ్లకు తగిలింది. దీంతో పాక్ ఫీల్డర్లు ఎల్‍బీడబ్ల్యూ అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వటంతో.. డీఆర్ఎస్ కోరుకుంది పాకిస్థాన్. అయితే, వార్నర్ ఔటైనట్టు డీఆర్ఎస్‍లో తేలింది. దీంతో వార్నర్ చివరి టెస్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో పెవిలియన్ వైపుగా డేవిడ్ వార్నర్ నడిచాడు.

ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న పాక్ ఆటగాళ్లకు వార్నర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే, సిడ్నీ మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు అందరూ నిలబడి చప్పట్లు కొడుతూ వార్నర్‌కు స్టాండిగ్ ఓవేషన్ ఇచ్చారు. హెల్మెట్‍కు ముద్దు పెట్టిన తర్వాత.. బ్యాట్, హెల్మెట్ ఎత్తి ప్రేక్షకులకు అభివాదం చేశాడు వార్నర్. అలాగే, గ్లవ్స్, హెల్మెట్‍ను ఓ అభిమానికి ఇచ్చేసి మంచి మనసు చాటుకున్నాడు. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‍లోకి వార్నర్ వెళ్లే వరకు ప్రేక్షకులు చప్పట్లతో మోతెక్కించారు.

ఇలా.. మైదానంలో టెస్టు ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్ చివరి క్షణాలు క్రికెట్ అభిమానుల గుండెలను బరువెక్కించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సొంత గ్రౌండ్ సిడ్నీలోనే తన టెస్టు కెరీర్‌ను వార్నర్ ముగించాడు.

ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు ఆడిన డేవిడ్ వార్నర్ 44.59 యావరేజ్‍తో 8,786 పరుగులు చేశాడు. 26 సెంచరీలు, 37 అర్ధ శతకాలు నమోదు చేశాడు. టెస్టుల్లో అతడి అత్యధిక స్కోరు 335 పరుగులు (నాటౌట్)గా ఉంది. 2011లో న్యూజిలాండ్‍తో మ్యాచ్‍లో టెస్టు అరంగేట్రం చేశాడు వార్నర్. ఇప్పుడు 13ఏళ్ల తర్వాత టెస్టులకు గుడ్‍బై చెప్పాడు.

వన్డేలకు కూడా..

వన్డే ఫార్మాట్‍కు కూడా డేవిడ్ వార్నర్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు 161 వన్డేల్లో 6,932 పరుగులు చేశాడు. 22 సెంచరీలు, 33 అర్ధశతకాలు బాదాడు. వన్డే క్రికెట్‍లో డ్యాషింగ్ ఓపెనర్‌గా వెలుగొందాడు. అయితే, వన్డేలకు వీడ్కోలు పలికినా అవసరమైతే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తిరిగి వస్తానని తెలిపాడు. టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న డేవిడ్ వార్నర్ ఇక టీ20 క్రికెట్ మాత్రమే ఆడనున్నాడు.

డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ (via REUTERS)
Whats_app_banner