Pakistan Cricket Team : ఆసియా కప్‌కు ముందు పాక్ ఆటగాళ్ల కొత్త డిమాండ్.. ఇరకాటంలో పీసీబీ!-cricket news pakistan cricket players deny to sign pcb central contract for this reason ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan Cricket Team : ఆసియా కప్‌కు ముందు పాక్ ఆటగాళ్ల కొత్త డిమాండ్.. ఇరకాటంలో పీసీబీ!

Pakistan Cricket Team : ఆసియా కప్‌కు ముందు పాక్ ఆటగాళ్ల కొత్త డిమాండ్.. ఇరకాటంలో పీసీబీ!

Anand Sai HT Telugu
Aug 20, 2023 05:57 AM IST

Pakistan Cricket Team : ఆసియా కప్ దగ్గరపడుతోంది. పాకిస్థాన్ ఆటగాళ్లు ఓ కొత్త డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. పీసీబీ కాంట్రాక్ట్ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్(Asia Cup) ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే టోర్నీలో పాల్గొనబోతున్న పాక్ ఆటగాళ్లకు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మధ్య చర్చలు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్థాన్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఇప్పటికే ముగిసింది. అయితే కొత్త ఒప్పందంపై సంతకం చేయడానికి ఆటగాళ్లు ఇష్టపడరటం లేదని సమాచారం.

ఆటగాళ్ల రెమ్యునరేషన్‌లో డిజిటల్ హక్కుల ఆదాయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిగణనలోకి తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అంటే మేజర్ టోర్నీల డిజిటల్ ప్రసార హక్కుల ద్వారా పీసీబీకి మంచి ఆదాయం వస్తోంది. కానీ ఈ ఆదాయంలో డివిడెండ్లలో ఆటగాళ్లకు ఎలాంటి వాటా ఇవ్వలేదు. దీంతో పాక్ జట్టు ఆటగాళ్లు ఇప్పుడు కొత్త కాంట్రాక్టుపై సంతకం చేసేందుకు విముఖత చూపుతున్నారు.

ఆసియా కప్‌కు ముందు ప్రిలిమినరీ మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు ఇప్పటికే శ్రీలంకకు బయలుదేరింది. ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కు ముందు ఆటగాళ్లతో కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ను PCB ఖరారు చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఒప్పందంపై సంతకం చేసేందుకు పాక్ ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేయడం పీసీబీ(PCB)ని ఆందోళనకు గురి చేసింది.

కాంట్రాక్టును పొడిగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) ముందుకు రావడంతో ఆటగాళ్లు తాజా డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్ ప్రకారం డిజిటల్ హక్కుల విక్రయం ద్వారా వచ్చే లాభాన్ని కూడా వారి జీతంలో కలపాలి.

డిజిటల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకోవడంపై ఇతర క్రికెట్ బోర్డులు ఆటగాళ్లతో సరైన ఒప్పందాలను కలిగి ఉన్నాయి. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రమే ఆటగాళ్లకు డిజిటల్ ఆదాయాన్ని అందించడం లేదు. అందుకే కొత్త కాంట్రాక్ట్ కు ముందే ఈ విషయాన్ని తేల్చాలని పాక్ ఆటగాళ్లు పట్టుబడుతున్నారు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్, ICC విక్రయించే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార డిజిటల్ హక్కుల నుండి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదాయాన్ని పొందుతుంది. డిజిటల్ క్లిప్‌లు, మ్యాచ్‌ల ఫోటోలను ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం ద్వారా ఆదాయం కూడా వస్తుంది. దీంతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా పీసీబీకి మంచి ఆదాయం సమకూరుతుంది.

ఈ ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని పాకిస్థాన్ ఆటగాళ్లు(Pakistan Players) డిమాండ్ చేశారు. అయితే దీనిపై పీసీబీ ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్‌(ODI World Cup)లకు ముందు పాకిస్థాన్ ఆటగాళ్ల కొత్త డిమాండ్ ఇప్పుడు పీసీబీని ఇరకాటంలో పడేసింది.

Whats_app_banner