IND vs WI 4th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. మార్పుల్లేకుండా బరిలోకి టీమిండియా
IND vs WI 4th T20: వెస్టిండీస్‍తో నాలుగో టీ20లో భారత్ టాస్ ఓడింది. మూడో టీ20 ఆడిన జట్టుతో మార్పుల్లేకుండా ఈ మ్యాచ్‍లో బరిలోకి దిగింది.
IND vs WI 4th T20: ఇండియా, వెస్టిండీస్ మధ్య కీలకమైన నాలుగో టీ20 షురూ అయింది. ఐదు టీ20ల సిరీస్‍లో భాగంగా ఈ నాలుగో మ్యాచ్ అమెరికాలోని ఫ్లోరిడా లౌడర్‌హిల్ వేదికగా నేడు (ఆగస్టు 12) జరుగుతోంది. 1-2తో వెనుకబడిన భారత్ సిరీస్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‍లో గెలవాల్సిందే. ఈ కీలక మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు వెస్టిండీస్ కెప్టెన్ రావ్మన్ పావెల్. టాస్ తమదై ఉంటే తాము కూడా బ్యాటింగ్ తీసుకునే వారమని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. అయితే, టాస్ ఓడడంతో భారత్ ముందుగా బౌలింగ్ చేయనుంది. మూడో టీ20 ఆడిన జట్టుతోనే ఎలాంటి మార్పులు లేకుండా ఈ నాలుగో మ్యాచ్‍లోనూ బరిలోకి దిగింది టీమిండియా. వెస్టిండీస్ మూడు మార్పులు చేసింది. తుది జట్లు ఎలా ఉన్నాయంటే..
“మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేద్దాం అనుకున్నాం. అయితే, ఏం మార్పు (పిచ్‍లో) ఉండకపోవచ్చని అనిపిస్తోంది. జట్టులో ప్రతీ ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. సత్తాచాటాలని తహతహలాడుతున్నారు. గత మ్యాచ్‍లో బౌలర్లు రాణించారు. ఆ తర్వాత తిలక్, సూర్య బ్యాటింగ్‍తో గెలిపించారు. మేం అదే టీమ్‍తో బరిలోకి దిగుతున్నాం. ఏ దశలోనూ మా ఇంటెన్సీటీ తగ్గనివ్వం” అని టాస్ సమయంలో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు.
ఇక, నాలుగో మ్యాచ్ కోసం వెస్టిండీస్ జట్టు తుది జట్టులో మూడు మార్పులు చేసింది. జేసన్ హోల్డర్, షాయో హోప్, ఒడీన్ స్మిత్ విండీస్ తుది జట్టులోకి వచ్చారు. సిరీస్ గెలిచేందుకు తమకు మంచి అవకాశం వచ్చిందని, అందరం ఉత్సాహంగా ఉన్నామని వెస్టిండీస్ కెప్టెన్ రావ్మన్ పావెల్ చెప్పాడు.
భారత తుది జట్టు: యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్, ముకేశ్ కుమార్
వెస్టిండీస్ తుది జట్టు: బ్రండెన్ కింగ్, కైల్ మేయర్స్, షాయో హోప్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రావ్మన్ పోవెల్ (కెప్టెన్), షిమ్రన్ హిట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, ఒడిన్ స్మిత్, అకీల్ హొసీన్, ఒబెడ్ మెక్‍కాయ్