SA vs Pak 1st T20: టీమ్ బస్ మిస్ చేసుకొని.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి.. పాకిస్థాన్ పని పట్టిన సౌతాఫ్రికా ఆల్ రౌండర్
SA vs Pak 1st T20: సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జార్జ్ లిండె తన కెరీర్లోనే మరచిపోలేని రోజు మంగళవారం (డిసెంబర్ 10). ఎందుకంటే టీమ్ బస్ మిస్ చేసుకున్న తర్వాత కూడా సమయానికి మ్యాచ్ కు వచ్చి ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతోపాటు ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో పాకిస్థాన్ పని పట్టాడు.
SA vs Pak 1st T20: పాకిస్థాన్ పని పట్టాడు సౌతాఫ్రికా యువ ఆల్ రౌండర్ జార్జ్ లిండె. అతని ఆల్ రౌండ్ ఫర్ఫార్మెన్స్ తో మంగళవారం (డిసెంబర్ 10) పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో సౌతాప్రికా 11 పరుగులతో గెలిచింది. అయితే అంతకుముందు ఇదే లిండె టీమ్ బస్ మిస్ చేసుకున్నాడు. పోలీస్ ఎస్కార్ట్ సాయంతో సమయానికి స్టేడియానికి చేరుకోవడం విశేషం.
జార్జ్ లిండె.. ది ఆల్ రౌండర్..
సౌతాఫ్రికా, పాకిస్థాన్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ జార్జ్ లిండెకు చాలా ప్రత్యేకమైనది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం సిద్ధమైన అతడు మొదట హోటల్ నుంచి స్టేడియానికి వెళ్లే టీమ్ బస్ మిస్సయ్యాడు. తర్వాత ఎలాగోలా పోలీసుల సాయంతో సమయానికి చేరుకున్నాడు.
అంత ఒత్తిడిలోనూ 24 బంతుల్లో 48 పరుగులు చేయడమే కాదు.. తర్వాత బౌలింగ్ లో కెరీర్ బెస్ట్ 4 వికెట్లు తీశాడు. "బస్ మిస్ కావడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. కచ్చితంగా టీమ్ ను గెలిపించాలని అనుకున్నాను. అదే జరిగినందుకు సంతోషంగా ఉంది" అని లిండె మ్యాచ్ తర్వాత చెప్పాడు.
జార్జ్ లిండె చెలరేగడంతో మొదట సౌతాఫ్రికా 20 ఓవర్లలో 183 రన్స్ చేసింది. తర్వాత పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. లిండె 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.
డ్రీమ్ కమ్‌బ్యాక్
నిజానికి జార్జ్ లిండె మూడేళ్ల తర్వాత అంటే 2021 తర్వాత తొలిసారి ఓ అంతర్జాతీయ టీ20 ఆడాడు. అది కూడా టీమ్ బస్ మిస్ చేసుకొని తీవ్ర ఒత్తిడిలో గ్రౌండ్లోకి దిగాడు. అలాంటి పరిస్థితుల్లోనూ లిండె చెలరేగిన తీరు అతనికి ఓ రకంగా డ్రీమ్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 183 రన్స్ చేసింది. డేవిడ్ మిల్లర్ 40 బంతుల్లోనే 82 రన్స్ చేశాడు. అయితే మిగిలిన బ్యాటర్లు విఫలమైనా.. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన లిండె 24 బంతుల్లోనే 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 48 రన్స్ చేశాడు.
తర్వాత చేజింగ్ లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (0) వికెట్ ను త్వరగానే కోల్పోయినా.. తర్వాత కెప్టెన్ రిజ్వాన్, సాయిమ్ ఆయుబ్ పాక్ ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 40 పరుగులు జోడించారు. ఆయుబ్ 15 బంతుల్లో 31 రన్స్ చేశాడు. ఇక కెప్టెన్ రిజ్వాన్ ఒంటరి పోరాటంతో 62 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 74 రన్స్ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
కీలకమైన సమయంలో పాక్ ను లిండె దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో షహీన్ అఫ్రిది, ఇర్ఫాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది వికెట్లు తీసుకున్నాడు. దీంతో పాకిస్థాన్ కు 11 పరుగులతో ఓటమి తప్పలేదు. దీంతో మూడు టీ20ల సిరీస్ లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.