ICC Test Rankings: టెస్టు ర్యాంకుల్లో సరికొత్త వరల్డ్ నంబర్ వన్.. టాప్ 10లో ఇద్దరు టీమిండియా ప్లేయర్స్
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో సరికొత్త వరల్డ్ నంబర్ వన్ అవతరించాడు. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ను వెనక్కి నెట్టి, ఆ దేశానికి చెందిన హ్యారీ బ్రూక్ నంబర్ వన్ అయ్యాడు. ఇక టీమిండియా నుంచి టాప్ 10లో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు.
ICC Test Rankings: ఐసీసీ బుధవారం (డిసెంబర్ 11) లేటెస్ట్ టెస్టు ర్యాంకులను రిలీజ్ చేసింది. ఇందులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ కే చెందిన జో రూట్ ను వెనక్కి నెట్టాడు. తాజా ర్యాంకుల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ పైకి దూసుకురాగా.. ఇండియన్ ప్లేయర్స్ దిగజారారు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
నంబర్ వన్ టెస్టు బ్యాటర్ గా చాలా రోజుల నుంచి కొనసాగిన జో రూట్ ఇప్పుడు కిందికి పడిపోయాడు. అతని స్థానంలో హ్యారీ బ్రూక్ నంబర్ వన్ అయ్యాడు. ఈ మధ్యే న్యూజిలాండ్ పై టెస్టుల్లో 8వ సెంచరీ చేసిన బ్రూక్.. తాజా ర్యాంకుల్లో అగ్ర స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం బ్రూక్ 898 పాయింట్లతో ఉండగా.. రూట్ 897 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ ఏడాది జులైలో కేన్ విలియమ్సన్ ను వెనక్కి నెట్టి తొలి స్థానానికి దూసుకెళ్లిన రూట్.. ఐదు నెలలుగా అదే స్థానంలో ఉన్నాడు. తన కెరీర్లో ఇలా నంబర్ వన్ ర్యాంకును రూట్ మొత్తంగా 9 సార్లు అందుకోవడం విశేషం. అయితే తాజాగా న్యూజిలాండ్ ను ఇంగ్లండ్ 323 పరుగులతో చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రూక్ (123, 55) టెస్టుల్లో నంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు. టెస్టుల్లో అడుగుపెట్టినప్పటి నుంచీ బ్రూక్ చెలరేగుతూనే ఉన్నాడు.
అతడు ఇప్పటి వరకూ 23 టెస్టుల్లోనే ఏకంగా 61.62 సగటుతో 2280 పరుగులు చేయడం విశేషం. ఈ ఏడాదే బ్రూక్ 11 టెస్టుల్లో నాలుగు సెంచరీలతో 1099 రన్స్ చేశాడు. అటు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా టాప్ 10లోకి వచ్చారు. ఇండియన్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్ 4, రిషబ్ పంత్ 9వ స్థానాల్లో ఉన్నారు.
బౌలర్లలో బుమ్రానే..
బౌలర్లలో మాత్రం బుమ్రానే నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. రెండో టెస్టులో టీమిండియా ఓడిపోయినా.. బుమ్రా మాత్రం 4 వికెట్లు తీసుకున్నాడు. అయితే అతనికి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, న్యూజిలాండ్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. టెస్టు ఆల్ రౌండర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా ఇప్పటికీ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ రెండో స్థానంలోకి వచ్చాడు.