Siraj Beer Snake: సిరాజ్‌కు కోపం తెప్పించి జరిమానాకు కారణమైన బీర్ స్నేక్.. దానికి రూ.2 లక్షలకుపైగా ఖర్చు చేసింది ఇతడే..
Siraj Beer Snake: సిరాజ్, హెడ్ మధ్య జరిగిన ఫైట్ తెలుసు కదా. అడిలైడ్ టెస్టులో జరిగిన ఈ ఘటనకు కారణమైన బీర్ స్నేక్ ను తయారు చేసిన వ్యక్తి దీనిపై స్పందించాడు. అంతేకాదు అతడు క్షమాపణ కూడా చెప్పాడు.
Siraj Beer Snake: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా సిరాజ్ ఏకాగ్రతను దెబ్బ తీసి, తర్వాత సహనం కోల్పోయేలా చేసిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. నిజానికి హెడ్ ఔటైన తర్వాత సిరాజ్ గొడవ పెట్టుకున్నా.. అంతకుముందే లబుషేన్ బ్యాటింగ్ చేసే సమయంలో ఓ బీర్ స్నేక్ సిరాజ్ ఏకాగ్రతను దెబ్బ తీసింది. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.
సిరాజ్ ఏకాగ్రతను దెబ్బ తీసిన బీర్ స్నేక్
బీర్ స్నేక్.. ఆస్ట్రేలియాలో క్రికెట్ జరిగే సమయాల్లో ప్రేక్షకులు తాగిన బీర్ గ్లాసులతో ఓ పాములాంటి ఆకారాన్ని తయారు చేయడం సాధారణంగా జరిగేదే. అడిలైడ్ టెస్టులోనూ లాచీ బర్ట్ అనే ఓ అభిమాని ఈ బీర్ స్నేక్ తయారు చేశాడు. దీనికోసం అతడు 250 ఖాళీ కప్పులను వాడాడు.
అంతేకాదు ఏకంగా 2750 ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.2.33 లక్షలు)ను ఖర్చు చేశాడు. అతనితోపాటు ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన 67 మంది సాయంతో బర్ట్ ఈ పని చేశాడు. గ్రౌండ్లో ఒక్కొక్కరికి 4 గ్లాసుల బీర్లు ఇస్తారు. అలా అందరూ కలిసి ఏకంగా 250 గ్లాసులు తీసుకొని అలా బీర్ స్నేక్ తయారు చేశారు.
ఆ బీర్ స్నేక్ పట్టుకొని సైట్ స్క్రీన్ వెనుక నుంచి ఆ వ్యక్తి ఓవైపు నుంచి మరో వైపుకు వెళ్లాడు. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న లబుషేన్ అది చూసి బౌలింగ్ చేస్తున్న సిరాజ్ ను ఆపాడు. అప్పటికే బంతిని విసరడానికి దగ్గరగా వచ్చి ఉండటంతో సహనం కోల్పోయిన సిరాజ్.. తన చేతిలో ఉన్న బంతిని అలాగే విసిరేశాడు.
ఇక అప్పటి నుంచీ సిరాజ్ చాలా కోపంగానే ఉన్నాడు. ఆ క్రమంలోనే హెడ్ ను ఔట్ చేసిన తర్వాత చాలా ఆగ్రహంగా అతనికి సెండాఫ్ ఇవ్వడం, దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి ఐసీసీ అతనికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడం జరిగింది.
బీర్ స్నేక్ అభిమాని ఏమన్నాడంటే..
అడిలైడ్ టెస్టులో తాను తయారు చేసిన బీర్ స్నేక్ ఇంత పని చేయడంతో లాచీ బర్ట్ అనే ఆ అభిమాని స్పందించాడు. "ప్రతి ఒక్కరూ నాలుగు డ్రింక్స కొనొచ్చు. మేము 67 మంది ఉన్నాం. ఒక్కొక్కరం నాలుగు కొన్నాం. మా చుట్టూ ఉన్న వాళ్లు కూడా దానిని ఎంజాయ్ చేశారు. అప్పుడు నేనేం చేశానో తెలియలేదు. అంతగా ఆలోచించలేదు. దానివల్ల ఇలా జరుగుతుందనీ ఊహించలేదు.
నాకే కాస్త సిల్లీగా అనిపించింది. సారీ మార్నస్. అలా చేయడం సరికాదు. అయినా ఒక్క బాల్ మాత్రమే అలా జరిగింది. తర్వాతి బంతికే మార్నస్ ఫోర్ కొట్టాడు. ఆ సమయంలో ఓవైపు నుంచి మరోవైపుకు వేగంగా వెళ్దామని అనుకున్నానంతే" అని చెప్పుకొచ్చాడు. కానీ అతడు చేసిన పని తర్వాత సిరాజ్ కు ఇంత ముప్పు తెచ్చిపెడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.