Bumrah in Team India: బుమ్రాను తీసుకోవడానికి కారణం ఇదే.. పాకిస్థాన్ దెబ్బకు భయపడిపోయిన సెలెక్టర్లు!
Bumrah in Team India: బుమ్రాను జట్టులోకి ఎందుకు తీసుకున్నారు? బంగ్లాదేశ్ తో సిరీస్ అతడు ఆడబోడని గతంలో వార్తలు వచ్చినా.. చివరి నిమిషంలో సెలక్టర్లు ఈ స్టార్ పేస్ బౌలర్ ను ఎంపిక చేశారు. పాకిస్థాన్ కు ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
Bumrah in Team India: బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కు స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను సెలెక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలుసు కదా. నిజానికి స్వదేశంలో జరగబోయే ఈ సిరీస్ కు కూడా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మొదట భావించారు. అతడు న్యూజిలాండ్ తో జరగబోయే మూడు టెస్టుల సిరీస్ కు తిరిగి వస్తాడని అనుకున్నారు. కానీ సెలక్టర్లు ఎందుకు అతన్ని ఎంపిక చేశారు?
బుమ్రాను అందుకే ఎంపిక చేశారా?
బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కు ఆదివారం (సెప్టెంబర్ 8) సెలక్టర్లు టీమిండియాను ఎంపిక చేసిన విషయం తెలుసు కదా. ఇందులో రిషబ్ పంత్ కమ్ బ్యాక్, యశ్ దయాల్ కు తొలిసారి అవకాశంలాంటి వార్తల కంటే బుమ్రాను ఎంపిక చేయడమే ఆశ్చర్యం కలిగించింది. అతనికి మరికొన్ని రోజులు విశ్రాంతి ఇస్తారని గతంలో వార్తలు వచ్చాయి.
కానీ ఆశ్చర్యకరంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారు. దీనికి కారణం ఈ మధ్యే పాకిస్థాన్ ను వాళ్ల దేశంలోనే బంగ్లాదేశ్ రెండు టెస్టుల్లోనూ ఓడించడమే అని భావిస్తున్నారు. దీనికితోడు శ్రీలంకలో ఎదురైన వన్డే సిరీస్ ఓటమి కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఆ సిరీస్ లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చి సిరాజ్, అర్ష్‌దీప్ లను బరిలోకి దించారు.
బంగ్లాదేశ్‌కు భయపడుతున్నారా?
పాకిస్థాన్ ఓటమి తర్వాత బంగ్లాదేశ్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తాజాగా టీమ్ ఎంపికతో స్పష్టమవుతోంది. ఈ సిరీస్ కు అందుబాటులో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ ను ఎంపిక చేశారు. బుమ్రా ఎంపిక కూడా అందులో భాగమే. మొదట అతన్ని పక్కన పెట్టి అర్ష్‌దీప్, ఖలీల్ లాంటి వాళ్లను తీసుకుంటారని వార్తలు వచ్చాయి.
కానీ బంగ్లాదేశ్ టీమ్ ప్రదర్శన చూసిన తర్వాత ప్రయోగాలు చేయకూడదని అజిత్ అగార్కర్ అండ్ టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే హడావిడిగా బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. సిరాజ్, అర్ష్‌దీప్ లతో కూడిన పేస్ బౌలింగ్ శ్రీలంకతో వన్డే సిరీస్ లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో బంగ్లాలాంటి జట్టుతో బుమ్రా లేకుండా బరిలోకి దిగడం మంచిది కాదని సెలెక్టర్లు, బీసీసీఐ భావించినట్లు స్పష్టమవుతోంది.
గతంలోనూ భయపెట్టారు..
నిజానికి డిసెంబర్ 2022లోనూ ఇండియా పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్.. మన గడ్డపై తొలిసారి టెస్టు గెలిచేలా కనిపించింది. అయితే శ్రేయస్ అయ్యర్, అశ్విన్ పోరాటంతో ఆ మ్యాచ్ లో ఎలాగోలా ఇండియా గెలిచింది. అందుకే ఈసారి ఎలాంటి ప్రయోగాలకు తావు లేకుండా బలమైన జట్టుతో బంగ్లాదేశ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.
అశ్విన్, కుల్దీప్, అక్షర్ లతో స్పిన్ బౌలింగ్ బలంగా ఉండగా.. బుమ్రా రాకతో పేస్ బౌలింగ్ కూడా బలపడింది. కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి వాళ్లు మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చారు. రోహిత్, గిల్, యశస్విలతో టాపార్డర్ కూడా చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ కు ఇక్కడ ఆ ఛాన్స్ ఇవ్వకూడదని టీమిండియా గట్టిగానే భావిస్తోంది.
బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు మిస్ అయిన బుమ్రా.. స్వదేశంలో జరగబోయే ఈ సిరీస్ లో ఏం చేస్తాడో చూడాలి.