ICC Rankings: ఇండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు షాక్.. నంబర్ వన్ ర్యాంకు గోవిందా..-australia over takes pakistan in icc rankings after win over south africa cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Rankings: ఇండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు షాక్.. నంబర్ వన్ ర్యాంకు గోవిందా..

ICC Rankings: ఇండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు షాక్.. నంబర్ వన్ ర్యాంకు గోవిందా..

Hari Prasad S HT Telugu
Sep 10, 2023 11:26 AM IST

ICC Rankings: ఇండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. వన్డేల్లో వాళ్ల నంబర్ వన్ ర్యాంకు పోయింది. సౌతాఫ్రికాతో శనివారం (సెప్టెంబర్ 9) జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆస్ట్రేలియా.. మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ (AFP)

ICC Rankings: పాకిస్థాన్ వన్డేల్లో తన నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయింది. ఇండియాతో ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ కు ముందు ఆ టీమ్ తమ ర్యాంక్ కోల్పోవడం గమనార్హం. పాకిస్థాన్ నంబర్ వన్ ర్యాంకును ఆస్ట్రేలియా ఆక్రమించింది. శనివారం (సెప్టెంబర్ 9) సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా మరోసారి వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ అందుకుంది.

సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియాకు ఇది వరుసగా రెండో విజయం. దీంతో తాజా ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ సెంచరీలు చేయడంతో సౌతాఫ్రికాను ఏకంగా 123 పరుగులతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట 8 వికెట్లకు 392 పరుగుల భారీ స్కోరు చేసింది.

తర్వాత చేజింగ్ లో సౌతాఫ్రికా 41.5 ఓవర్లలోనే 269 పరుగులకు ఆలౌటైంది. గురువారం (సెప్టెంబర్ 7) జరిగిన తొలి వన్డేలోనూ సౌతాఫ్రికాను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. ఇప్పుడు మంగళవారం (సెప్టెంబర్ 12) జరగబోయే మూడో వన్డేలోనూ గెలిస్తే సిరీస్ ఎగరేసుకుపోతుంది. రెండో వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా ఐసీసీ ర్యాంకుల్లో 121 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ గా నిలిచింది.

పాకిస్థాన్ ఒక పాయింట్ తక్కువగా రెండోస్థానానికి పడిపోయింది. ఇక ఇండియా 114 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. ఏడాది కాలంగా ఆస్ట్రేలియా వన్డేల్లో నిలకడగా రాణిస్తోంది. గతడేది శ్రీలంక చేతుల్లో సిరీస్ కోల్పోవడం, జింబాబ్వేతో ఓ వన్డేలో ఓడిపోవడం మినహాయించి ఆస్ట్రేలియా రికార్డు బాగానే ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ లను 3-0తో వైట్ వాష్ చేసింది.

ఈ ఏడాది మార్చిలో ఇండియాపైనా విజయం సాధించింది. ఇప్పుడిక సౌతాఫ్రికాను చిత్తు చేసి వన్డేల్లో నంబర్ వన్ కు చేరుకుంది. వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని ఇది పెంచుతుంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ఆసియా కప్ లో తలపడుతుండటంతో ఆ టీమ్ జయాపజయాలు ఈ ర్యాంకును ప్రభావితం చేయవచ్చు.