AUS vs ENG: సెమీస్‍కు మరింత చేరువైన ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‍కు మరో పరాభవం
AUS vs ENG World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో ఇంగ్లండ్‍ను ఆస్ట్రేలియా చిత్తుచేసింది. దీంతో సెమీ ఫైనల్ అర్హతకు మరింత సమీపించింది.
AUS vs ENG World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో ఆస్ట్రేలియా జోరు కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయంతో సెమీ ఫైనల్ అర్హతకు మరింత సమీపించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‍కు మరో పరాభవం తప్పలేదు. అహ్మదాబాద్ వేదికగా నేడు (నవంబర్ 4) జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‍లో ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో ఇంగ్లండ్‍పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్‍కు క్వాలిఫై అయ్యేందుకు ఆసీస్ మరింత సమీపించింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లబుషేన్ (71) అర్ధ శకతంతో రాణించగా.. కామెరూన్ గ్రీన్ (47), స్టీవ్ స్మిత్ (44) ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్, వుడ్‍కు చెరో రెండు వికెట్లు దక్కాయి.
లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (64 పరుగులు), డేవిడ్ మలన్ (50) అర్ధ శతకాలతో పాటు మోయిన్ అలీ (42) పర్వాలేదనిపించినా మిగిలిన బ్యాటర్లు విఫలమవటంతో ఇంగ్లిష్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆజమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. పేసర్లు మిచెల్ స్టార్క్, హేజిల్‍వుడ్, కమిన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ గెలుపుతో ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్‍ల్లో ఐదింట విజయం సాధించినట్టయింది. 10 పాయింట్లతో ప్రపంచకప్ పట్టికలో మూడో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. సెమీస్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. ఇక, ఇంగ్లండ్ ఏడింట ఆరు మ్యాచ్‍ల్లో ఓడి ఆఖరి స్థానంలోనే కొనసాగింది. పేలవ ప్రదర్శన కొనసాగించింది.
మలన్, స్టోక్స్ పోరాడినా..
లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (0) తొలి ఓవర్ తొలి బంతికే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ మలన్ (50) అర్ధ శకతంతో రాణించాడు. జో రూట్ (13), కెప్టెన్ జోస్ బట్లర్ (1) విఫలమయ్యారు. మలన్ తర్వాత సీనియర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (64) నిలకడగా ఆడి క్రమంగా పరుగులు రాబట్టాడు. మంచి పోరాటం చేశాడు. అతడికి మోయిన్ అలీ (42) సహకరించాడు. అయితే, ఈ ఇద్దరూ ఔటయ్యాక పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో లివింగ్ స్టోన్ (2) త్వరగా పెవిలియన్ చేరాడు. చివర్లో క్రిస్ వోక్స్ (32), ఆదిల్ రషీద్ (20) పోరాడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారేలా కనిపించింది. అయితే, ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‍ను ఆసీస్ బౌలర్లు కూల్చేశారు. ఆసీస్ స్పిన్నర్ ఆజమ్ జంపా.. ఓ దశలో స్టోక్స్, బట్లర్, అలీని ఔట్ చేసి మ్యాచ్‍ను మలుపు తిప్పాడు.
టాస్ ఓడి ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‍కు దిగగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. అయితే, మార్నస్ లబుషేన్ 83 బంతుల్లో 71 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రాణించాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ (47), మార్కస్ స్టొయినిస్ (35) ఆకట్టుకోవడంతో ఆస్ట్రేలియా 286 రన్స్ చేయగలిగింది.