CUET-UG: ‘‘2025 నుంచి సీయూఈటీ - యూజీ పరీక్షలో పలు కీలక మార్పులు’’; యూజీసీ చీఫ్ వెల్లడి
CUET-UG: 2025 నుంచి సీయూఈటీ-యూజీ పరీక్ష విధానంలో కీలక మార్పులను తీసుకువస్తున్నట్లు యూజీసీ చైర్మన్ యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. 2025 నుంచి ఈ పరీక్షను మొత్తం 63 సబ్జెక్టుల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. అన్ని పరీక్షలకు వ్యవధి 60 నిమిషాలు ఉంటుందన్నారు.
12వ తరగతిలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులు ఏ సబ్జెక్టులోనైనా సీయూఈటీ-యూజీకి హాజరుకావచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. 2025 నుంచి విద్యార్థులు సీయూఈటీ-యూజీలో గరిష్టంగా ఐదు సబ్జెక్టులకు హాజరుకావచ్చని యూజీసీ చీఫ్ తెలిపారు.
37 కాదు 63 సబ్జెక్టుల్లో..
2025 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో మాత్రమే సీయూఈటీ-యూజీ (Common University Entrance Test - CUET) నిర్వహిస్తారు. సీయూఈటీ-యూజీని 2025 సెషన్ నుంచి 37 సబ్జెక్టులకు బదులుగా 63 సబ్జెక్టుల్లో నిర్వహించనున్నట్లు జగదీశ్ కుమార్ తెలిపారు. అన్ని సీయూఈటీ-యూజీ (CUET UG) పరీక్షల వ్యవధి 60 నిమిషాలు ఉంటుందని, అన్ని ఆప్షనల్ ప్రశ్నలను తొలగిస్తామని తెలిపారు.
గరిష్టంగా ఐదు సబ్జెక్టులకు
2025 నుంచి సీయూఈటీ-యూజీలో ఒక విద్యార్థి గరిష్టంగా ఐదు సబ్జెక్టులకు హాజరుకావచ్చని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)లో నిపుణుల కమిటీ సమీక్ష అనంతరం 2025 నుంచి పలు మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. సీయూఈటీ-యూజీ, పీజీ పరీక్షల నిర్వహణను సమీక్షించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
2022 నుంచి ప్రారంభం
2022లో జరిగిన మొదటి ఎడిషన్ పరీక్షలో సీయూఈటీ-యూజీ సాంకేతిక లోపాలతో సతమతమైంది. 2024లో తొలిసారి హైబ్రిడ్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఆ సంవత్సరం లాజిస్టిక్ కారణాల వల్ల ఒక రాత్రి ముందు ఢిల్లీ అంతటా ఈ పరీక్షను రద్దు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంస్థల నుంచి ఫీడ్ బ్యాక్, సూచనలను ఆహ్వానిస్తూ సీయూఈటీ-యూజీ, సీయూఈటీ-పీజీ 2025 (cuet pg)నిర్వహణకు సవరించిన మార్గదర్శకాలను వివరిస్తూ యూజీసీ త్వరలో ముసాయిదా ప్రతిపాదనను విడుదల చేయనుంది. విభిన్న విద్యా బోర్డులు, సామాజిక-ఆర్థిక నేపథ్యాలకు చెందిన విద్యార్థులకు సీయూఈటీ సమాన అవకాశాలను కల్పించిందని యుజిసి చీఫ్ పేర్కొన్నారు.
283 విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు
గత సంవత్సరం 283 విశ్వవిద్యాలయాలు తమ కళాశాలల్లో ప్రవేశానికి సీయూఈటీ (CUET) ని ప్రామాణికంగా తీసుకున్నాయి. గత సంవత్సరం సీయూఈటీ యూజీ కి 13,47,820 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.