Zomato new feature: జొమాటోలో మరో కొత్త ఫెసిలిటీ; ఇక ఆ ‘చిల్లర’ సమస్య ఉండదు..-zomato makes cash on delivery smoother you can now get remaining balance in you online wallet ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato New Feature: జొమాటోలో మరో కొత్త ఫెసిలిటీ; ఇక ఆ ‘చిల్లర’ సమస్య ఉండదు..

Zomato new feature: జొమాటోలో మరో కొత్త ఫెసిలిటీ; ఇక ఆ ‘చిల్లర’ సమస్య ఉండదు..

HT Telugu Desk HT Telugu
Aug 08, 2024 08:11 PM IST

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన యాప్ లో మరో కొత్త ఫెసిలిటీని అందిస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లకు సంబంధించి అటు వినియోగదారులకు, ఇటు డెలివరీ ఏజెంట్లకు తరచూ ఏర్పడే చిల్లర సమస్యను పరిష్కరించింది. బిల్ అమౌంట్ పోనూ మిగిలిన చిల్లరను మీ ఆన్లైన్ వాలెట్ కు బదిలీ చేసే సదుపాయాన్ని కల్పించింది.

జొమాటోలో ఇక ఆ ‘చిల్లర’ సమస్య ఉండదు
జొమాటోలో ఇక ఆ ‘చిల్లర’ సమస్య ఉండదు (Unsplash)

Zomato new feature: భారతదేశంలో జొమాటో లేదా స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఆర్డర్ విషయంలో, క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకున్న వినియోగదారులు తరచూ ఎదుర్కొనే సమస్య చిల్లర సమస్య. ఇది సాధారణ సమస్యే కానీ వినియోగదారులకు తరచూ చికాకు కలిగిస్తుంది. అంతే కాకుండా, బిల్ మొత్తాన్ని మినహాయించుకున్న తరువాత మిగిలిన బ్యాలెన్స్ ను వినియోగదారులకు అప్పగించే బాధ్యత ఉన్నందున డెలివరీ సిబ్బంది సమయం కూడా ఈ చిల్లర సమస్య వృధా చేస్తుంది.

చిల్లర సమస్య తీరింది..

ఇప్పుడు ఆ సమస్యను జొమాటో పరిష్కరించింది. జొమాటో వినియోగదారులు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకుంటే, వారు బిల్లు చెల్లించిన తరువాత మిగిలిన మొత్తాన్ని.. జొమాటో వారి ఆన్ లైన్ వ్యాలెట్ కు బదిలీ చేస్తుంది. జొమాటో యాప్ లోని జొమాటో మనీ అకౌంట్ కు బదిలీ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్ ను జొమాటో ప్రారంభించింది.

చాలా ఉపయోగకరం..

క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లను డెలివరీ చేసే సమయంలో డెలివరీ ఏజెంట్లు ఎదుర్కొనే సమస్య ఈ ‘చేంజ్’ సమస్య. "ఈ రోజు నుండి, మా వినియోగదారులు డెలివరీ భాగస్వాములకు నగదు చెల్లించవచ్చు. మిగిలిన మొత్తాన్ని వారి జొమాటో మనీ ఖాతాకు తక్షణమే యాడ్ చేయమని అడగవచ్చు. ఈ బ్యాలెన్స్ ను భవిష్యత్ డెలివరీ ఆర్డర్లు లేదా డైనింగ్ అవుట్ కోసం ఉపయోగించుకోవచ్చు’ అని జొమాటో (zomato) సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. కిరాణా, నిత్యావసరాల డెలివరీ వ్యాపారంలో పనిచేస్తున్న బిగ్ బాస్కెట్ ఈ పరిష్కారం వెనుక ప్రేరణను అందించినందుకు గోయల్ కృతజ్ఞతలు తెలిపారు.

జొమాటో మనీ వాలెట్ అంటే ఏమిటి?

జొమాటో మనీ (Zomato Money) అనేది జొమాటో యాప్ లోని డిజిటల్ వాలెట్ ఫీచర్. ఇది డబ్బును లోడ్ చేయడానికి, మీ ఫుడ్ డెలివరీ ఆర్డర్ల కోసం సౌకర్యవంతంగా ఒకే ట్యాప్ తో చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఇది మీరు మీ ఆర్డర్ల కోసం డబ్బులు చెల్లించేటప్పుడు సమయాన్ని ఆదా చేస్తుంది. ఎందుకంటే మీరు ముందుగానే డబ్బును లోడ్ చేయవచ్చు. మీ ఆన్లైన్ డెలివరీ ఆర్డర్ల కోసం, అలాగే, జొమాటోను ఉపయోగించి చెల్లింపులను ఆమోదించే రెస్టారెంట్లలో భోజనం చేయడానికి మీరు ఈ డబ్బును ఉపయోగించవచ్చు. క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్ల నుండి మీరు అందుకున్న మిగిలిన డబ్బు జొమాటో మనీ వాలెట్ కు యాడ్ అవుతుంది. పైన పేర్కొన్న ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించవచ్చు.