Zomato share price target : ఏడాదిలో 180శాతం పెరిగిన జొమాటో స్టాక్​- ఇప్పుడు కొన్నా భారీ లాభాలు..!-zomato share price target stock soars 180 in last 1 year axis securities gives buy rating ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Share Price Target : ఏడాదిలో 180శాతం పెరిగిన జొమాటో స్టాక్​- ఇప్పుడు కొన్నా భారీ లాభాలు..!

Zomato share price target : ఏడాదిలో 180శాతం పెరిగిన జొమాటో స్టాక్​- ఇప్పుడు కొన్నా భారీ లాభాలు..!

Sharath Chitturi HT Telugu
Aug 02, 2024 07:29 AM IST

Zomato share price : స్టాక్​ మార్కెట్​లో జొమాటో షేర్లు దూసుకెళుతున్నాయి. ఏడాదిలో దాదాపు 180శాతం పెరిగాయి. జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఏడాదిలో 180శాతం పెరిగిన జొమాటో స్టాక్
ఏడాదిలో 180శాతం పెరిగిన జొమాటో స్టాక్ (Agencies)

ఎఫ్​వై25 క్యూ1కు సంబంధించి అదిరిపోయే ఫలితాలను ప్రకటించింది దిగ్గజ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో. అయితే ఈ ఏడాదిలో జొమాటో షేర్లు ఇప్పటికే దాదాపు 180శాతం పెరిగాయి. ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతాయని, జొమాటోకి బై రేటింగ్​ ఇస్తూ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని రూ. 280గా ప్రకటించింది యాక్సిస్ సెక్యూరిటీస్.

జొమాటో షేర్​ ప్రైజ్​ హిస్టరీ..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో జొమాటో స్టాక్​ 3.6శాతం పెరిగి రూ. 237.9 వద్ద ముగిసింది. ఇదే సెషన్​లో జీవితకాల గరిష్ఠమైన రూ. 238ని స్టాక్​ టచ్​ చేసింది. 5 రోజుల్లో జొమాటో షేర్లు 7.2శాతం, నెల రోజుల్లో 13.78శాతం, ఆరు నెలల్లో ఏకంగా 65.44శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు జొమాటో స్టాక్​ ఏకంగా 91శాతం లాభపడింది. అంతేకాదు ఏడాది కాలంలో జొమాటో షేర్లు 179.72శాతం పెరిగాయి. రూ. 85 నుంచి రూ. 237.9కి చేరాయి. 

జొమాటో క్యూ 1 ఫలితాలు..

జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో ఏకీకృత నికర లాభం రూ. 253 కోట్లకు పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ1)లో కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాదితో పోలిస్తే 126.5 రెట్లు పెరిగింది. ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో ఆదాయం వరుసగా ఐదో త్రైమాసికం వృద్ధి చెందడం గమనార్హం. జొమాటో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 74 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జొమాటో తొలిసారి రూ.2 కోట్ల నికర లాభం, రూ.2,416 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ రూ. 280!

ఎఫ్​వై25 క్యూ1 ఫలితాలు వెలువడకముందే, భారత ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటోకి బై కాల్ ఇచ్చింది యాక్సిస్​ సెక్యూరిటీస్​. టార్గెట్ ధరను రూ .280 గా ప్రకటించింది. ఇది గురువారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ ముగింపు ధరతో పోల్చుకుంటే దాదాపు 20శాతం ఎక్కువ.

క్విక్ కామర్స్ రంగంలో జొమాటో విస్తరణకు లాభదాయకతలో స్థిరమైన పెరుగుదల, హైపర్ ప్యూర్, క్విక్ కామర్స్ డొమైన్లలో నష్టాలు గణనీయంగా తగ్గుతాయని తాము విశ్వసిస్తున్నామని యాక్సిస్ సెక్యూరిటీస్ తెలిపింది.

ఫుడ్ డెలివరీ మార్కెట్​లో జొమాటో తన ఉనికిని బలోపేతం చేసుకుంటుందని, నిరంతరం కొత్త టెక్నాలజీని స్వీకరించడం, ఆవిష్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా మార్కెట్ వాటాను పొందుతుందని యాక్సిస్ భావిస్తోంది.

ఫుడ్ డెలివరీ వ్యాపారంలో వృద్ధికి భారీ అవకాశాలు ఉండటంతో జొమాటో పట్ల యాక్సిస్ సెక్యూరిటీస్​ సానుకూలంగా ఉంది.

"ప్రస్తుతం భారత్​ దేశ మొత్తం జనాభాలో పట్టణ జనాభా వాటా 34-35 శాతంగా ఉంటుంది. 2030 నాటికి, ఈ పట్టణ జనాభా గణనీయమైన పెరుగుదలను చూస్తుందని అంచనాలు సూచిస్తున్నాయి. ఇది భారతదేశ మొత్తం జనాభాలో దాదాపు 42-43 శాతానికి చేరుకుంటుంది. పట్టణీకరణలో ఈ పెరుగుదల వ్యాపారాలకు గణనీయమైన మార్కెట్ సామర్థ్యాన్ని అందిస్తుంది," అని యాక్సిస్ సెక్యూరిటీస్​ తెలిపింది.

దేశంలో ఆహార వినియోగం భారత జీడీపీలో నాలుగో వంతుకు దోహదం చేస్తుందని, ఇందులో 10 శాతం రెస్టారెంట్ ఫుడ్ ద్వారానే జరుగుతోంది యాక్సిస్​ సెక్యూరిటీస్​ తెలిపింది.అంతేకాక, భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వ్యాప్తి ఫుడ్ డెలివరీ వ్యాపారం వృద్ధికి దీర్ఘకాలిక మద్దతును అందిస్తుందని పేర్కొంది.

హైపర్ ప్యూర్, క్విక్ కామర్స్ (బ్లింకిట్) విభాగాలు జొమాటో ఆదాయ వృద్ధికి దోహదం చేస్తాయని యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తోంది.

“తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, క్విక్​ కామర్స్​ జొమాటోకు గణనీయమైన మార్కెట్ అవకాశాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఈ విభాగంలో చిన్న మార్కెట్ వాటా కూడా గణనీయమైన ఆదాయ వృద్ధిని ప్రేరేపిస్తుంది,” అని యాక్సిస్​ సెక్యూరిటీస్​ స్పష్టం చేసింది.

బ్లింకిట్ మార్కెట్ వాటా తన పోటీదారుల కంటే మెరుగ్గా పెరుగుతోందని బ్రోకరేజీ సంస్థ భావిస్తున్నందున బ్లింకిట్ జీఓవీ (స్థూల ఆర్డర్ విలువ) 2024-30 ఇ కంటే 38 శాతం సీఎజీఆర్ వద్ద 10.5 బిలియన్ డాలర్ల మార్కును తాకుతుందని యాక్సిస్ అంచనా వేసింది.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఏదైనా స్టాక్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదిండం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం