Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్
Nikhil Kamath: భారతీయ నగరాల్లో తనకు ఇష్టమైనది బెంగళూరేనని జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ చెప్పారు. బెంగళూరు ప్రజలు మంచివారని కితాబిచ్చారు. భారతదేశంలో స్టార్టప్ లకు ఉన్న టాలెంట్ యాక్సెస్ ను ఆయన ప్రశంసించారు. ఇటీవల యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఒక పాడ్ కాస్ట్ లో ఈ ఆసక్తికర వ్యాఖ్యలను కామత్ చేశారు.
Nikhil Kamath: జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ యూట్యూబ్ లో ఇటీవల అప్ లోడ్ చేసిన తన పాడ్ కాస్ట్ ‘డబ్ల్యూటీఎఫ్ (WTF)’ లో తనకు ఇష్టమైన నగరాన్ని, దానిని ఇష్టపడటానికి గల కారణాన్ని వివరించారు. రోడ్లు, ట్రాఫిక్ వంటి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ బెంగళూరు తనకు చాలా ఇష్టమైన నగరమని వెల్లడించారు. బెంగళూరు ప్రజలే అందుకు కారణమని అదే నగరానికి చెందిన నిఖిల్ కామత్ చెప్పారు.
ప్రతీ నగరానికి ఒక ప్రత్యేకత
భారత్ లో ప్రతీ నగరానికి ఒక ప్రత్యేకత ఉంటుందని నిఖిల్ కామత్ వ్యాఖ్యానించారు. ముంబై నగరంలోని ప్రజలు చాలా అందంగా ఉంటారని, అక్కడంతా హడావుడి సంస్కృతి ఉంటుందని, హైదరాబాద్ విషయానికి వస్తే, అది బిర్యానీకి ఫేమస్ అని కామత్ వివరించారు. ఢిల్లీలో ధనవంతులు ఎక్కువగా ఉంటారని అన్నారు. బెంగళూరు విషయానికి వస్తే, ఈ నగరం మంచి వ్యక్తులకు ప్రసిద్ధి చెందిందని ప్రశంసించారు. ఇక్కడి ప్రజలు చాలా మంచి వారని, రోడ్లు, ట్రాఫిక్ వంటి సమస్యలు ఉన్నప్పటికీ.. బెంగళూరు వాసులు తమ నగరాన్ని ఎంతగానో ప్రేమిస్తారన్నారు. ‘బెంగళూరు ప్రజలు ఎవరికీ తీసిపోరు. నగరంపై వారికి ఉన్న ప్రేమ గొప్పది. ప్రజలుగా వారు ఎంత మంచివారు. రోడ్లు, ట్రాఫిక్ వంటి సమస్యలు వారికి అంత పెద్దవి కావు’ అని ఆయన అన్నారు.
టాలెంట్ ఫర్ బిజినెస్, స్టార్టప్స్
భారతదేశంలో స్టార్టప్ లకు "టాలెంట్ యాక్సెస్" ను అందిస్తున్నందుకు జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ బెంగళూరు నగరాన్ని ప్రశంసించారు. ‘‘ఏదైనా నిర్మించాల్సి వస్తే, ఒక కంపెనీని ప్రారంభించాల్సి వస్తే, బెంగళూరులో తక్కువ ఖర్చుతో గొప్ప టాలెంట్ అందుబాటులో ఉంటుంది. అది ప్రపంచంలో మరెక్కడా లభిస్తుందని నేను అనుకోవడం లేదు’’ అని ఆయన అన్నారు. బెంగళూరును మరింత నివాస యోగ్యంగా మార్చడం కోసం తాను తరచుగా బయోకాన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ మజుందార్ షా వంటి వ్యాపార ప్రముఖులను కలుస్తానని కామత్ తెలిపారు. సెంట్రల్ బెంగళూరులో 10,000 చెర్రీ పూల మొక్కలు నాటే ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు.