Hindu meals: విస్తారా విమానాల్లో ‘హిందూ మీల్స్’, ‘ముస్లిం మీల్స్’; ప్రయాణికుల మండిపాటు-woman asks vistara why veg meals called hindu and non veg meals muslim ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hindu Meals: విస్తారా విమానాల్లో ‘హిందూ మీల్స్’, ‘ముస్లిం మీల్స్’; ప్రయాణికుల మండిపాటు

Hindu meals: విస్తారా విమానాల్లో ‘హిందూ మీల్స్’, ‘ముస్లిం మీల్స్’; ప్రయాణికుల మండిపాటు

HT Telugu Desk HT Telugu
Aug 28, 2024 08:51 PM IST

Vistara: విస్తారా విమాన యాన సంస్థ విమానాల్లో ప్రయాణికులకు అందించే ఆహారానికి మతాన్ని పులమడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ విమానాల్లో శాకాహార భోజనం తీసుకుంటే, దానిని హిందూ మీల్స్ అని, మాంసాహార భోజనం తీసుకుంటే ముస్లిం మీల్స్ అని కోడ్స్ పెట్టడంపై దుమారం రేగుతోంది.

విస్తారా విమానాల్లో 'హిందూ మీల్స్', ‘ముస్లిం మీల్స్’
విస్తారా విమానాల్లో 'హిందూ మీల్స్', ‘ముస్లిం మీల్స్’

Vistara food: విస్తారా విమాన యాన సంస్థ విమానాల్లో ఆహారానికి మతం పేరుతో కోడ్స్ పెట్టడాన్ని ఒక ప్రయాణికురాలు ప్రశ్నించారు. ఆహారానికి కూడా మతం రంగు పులుముతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తారా విమానాల్లో శాకాహార భోజనం తీసుకుంటే, దానిని హిందూ మీల్స్ అని, మాంసాహార భోజనం తీసుకుంటే ముస్లిం మీల్స్ అని కోడ్స్ పెట్టారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ అయిన ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, విస్తారా విమానయాన సంస్థను నిలదీసింది.

శాఖాహారం అయితే హిందూ మీల్..

తమ విమానాల్లో శాకాహార భోజనాన్ని 'హిందూ మీల్' అని, మాంసాహారం అయితే 'ముస్లిం మీల్' అని ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నిస్తూ, ఎక్స్ లో జర్నలిస్ట్ ఆర్తి టికూ సింగ్ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కు విస్తారాను, పౌర విమానయాన శాఖను ట్యాగ్ చేశారు. హిందువులంతా శాకాహారులని, ముస్లింలంతా మాంసాహారులని ఎవరు చెప్పారని ఆమె విమానయాన సంస్థను ప్రశ్నించారు. ‘‘మతం ప్రాతిపదికన ఆహార ఎంపికలను ప్రజలపై ఎందుకు రుద్దుతున్నారు? ఇలా చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు’’ అని ఆమె ప్రశ్నించారు. విమాన ప్రయాణీకులను కూడా మత ప్రాతిపదికన చూస్తున్నారా? అని అడిగారు. విమానంలో భోజనాలకు సంబంధించిన ఆ ఫుడ్ కోడ్స్ ను చూసి తాను చాలా షాక్ అయ్యానని, మీ తీరును ధిక్కరించడానికి తాను రెండు భోజనాలను బుక్ చేసుకున్నానని వివరించారు.

సోషల్ మీడియాలో వైరల్..

జర్నలిస్ట్ ఆర్తి టికూ సింగ్ పెట్టిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ పోస్ట్ కు దాదాపు 200 కామెంట్లు, 600కు పైగా రీపోస్టులు అయ్యాయి. ‘‘ఇప్పుడు మతాల ఆధారంగా భోజనం చేస్తున్నారా? వావ్!! @DGCAIndia ఈ పద్ధతిని వెంటనే ఆపండి’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉంది. వీలైనంత త్వరగా ఈ వర్గీకరణను ఉపసంహరించుకోవాలి’’ అని అనూప్ జైస్వాల్ ట్వీట్ చేశారు.

ఫుడ్ కోడ్స్ ను వివరించిన వెటరన్..

అయితే, అలా కోడ్స్ లో ఆహార ఎంపికలను వివరించడం సాధారణమేనని, ప్రపంచవ్యాప్తంగా ఇది కొనసాగుతుందని విమానయాన రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న ఒక వ్యక్తి వివరించారు. హిందూ మీల్ (HNML) అంటే తప్పనిసరిగా వెజ్ భోజనం కాదని వివరించాడు. కొన్ని సాధారణ భోజన సంకేతాలను తన పోస్ట్ లో ఆయన పంచుకున్నాడు.

హలాల్ భోజనం..

‘‘సాధారణ విమానయాన పరిభాషలో, హిందూ భోజనం (HNML) తప్పనిసరిగా వెజ్ భోజనం కాదు. ఇది హలాల్ కాని నాన్ వెజ్ భోజనం కూడా కావచ్చు. అదేవిధంగా ముస్లిం మీల్ (MOML) అనేది మాంసాహార భోజనం. ఇది హలాల్ భోజనం" అని అవియాలాజ్ సీఈఓ సంజయ్ లాజర్ వివరించారు. అలాగే, శాకాహార భోజనం ((AVML లేదా VGML- లేదా VLML లేదా VOML)) మాత్రం స్వచ్ఛమైన వెజ్ మీల్ అని తెలిపారు. విస్తారా తప్పేం చేయలేదని, విమాన యాన సంస్థలు ఈ ఫుడ్ (FOOD) కోడ్స్ ను ఉపయోగిస్తుంటాయని తెలిపారు. కావాలంటే గూగుల్ (google) చేసుకుని ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఫుడ్ కోడ్స్ దాదాపు 100 కు పైగా ఉంటాయన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కామన్..

జెట్ ఎయిర్ వేస్ మాజీ సీఈఓ-నియమిత సంజీవ్ కపూర్ కూడా కూడా సంజయ్ లాజర్ వాదనతో ఏకీభవించారు. ప్రపంచవ్యాప్తంగా విమానాలలో భోజన కోడ్ లను ప్రామాణికం చేయడానికి అమేడియస్ వంటి గ్లోబల్ జీడీఎస్ వ్యవస్థలను ఉపయోగించే అన్ని విమానయాన సంస్థలు ఈ కోడ్లను ఉపయోగిస్తాయని ఆయన తెలిపారు.

Whats_app_banner