Budget 2024 : బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతారా? పరిష్కారం చూపిస్తారా?
Budget 2024 : కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈసారి నిరుద్యోగుల గురించి ఏమైనా ప్రకటనలు చేస్తారా? అనే ఆసక్తి అందరికీ ఉంది.
ఇటీవల లేఆఫ్స్ గురించి చర్చ ఎక్కువైంది. ఆ కంపెనీలో లేఆఫ్... ఈ కంపెనీలో ఒక్కరోజే 200 మంది ఉద్యోగులను తొలగించారు... ఇలా 2024 ప్రారంభం నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాం. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా ఉద్యోగాల కల్పనకు దారితీసే చర్యలు ఏమైనా ఉంటాయా? అనేది ఆసక్తిగా ఉంది.
కొన్ని నెలల క్రితం మాట్లాడిన ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగారియా నిరుద్యోగం అంత పెద్ద సమస్య కాదు అని అన్నారు. మూలధనం ఒకే చోట కేంద్రీకృతమై కార్మికవర్గానికి అందుబాటులోకి రావాలి. సంబంధిత శాఖలో పంపిణీ చేయాల్సి ఉందన్నారు.
నేషనల్ శాంపిల్ సర్వే కూడా నిరుద్యోగంపై తన నివేదికను సమర్పించింది. నిరుద్యోగిత రేటులో స్వల్ప తగ్గుదల ఉందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం అధికంగా ఉండడం చర్చనీయాంశమైంది. జనవరి-మార్చి 2024లో నిరుద్యోగ రేటు 6.7 శాతం. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో శాతంగా ఉంది. 6.8గా ఉంది.
'ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుబడితో కూడిన అభివృద్ధి ప్రణాళికపై దృష్టి సారించింది. ఫలితంగా దేశంలో మౌళిక సదుపాయాల నాణ్యత పెరిగింది. 2023-24 బడ్జెట్లో మూలధన వ్యయం రూ. 10లక్షల కోట్లు కాగా ఇది 2019-20 బడ్జెట్ మూలధన వ్యయానికి మూడు రెట్లు ఎక్కువ. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం 2024-25 మధ్యంతర బడ్జెట్ లో మౌళిక సదుపాయాల కోసం రూ. 11.1 లక్ష కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్ తో పోల్చితే ఇది 11 శాతం ఎక్కువ. మౌళిక సదుపాయాలు, ఉత్పత్తి పెంపునకు దృష్టి సారించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ కల్పనపై దీని ప్రభావం ఎక్కువగా కనబడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గృహ-రహదారుల నిర్మాణం, రైల్ కారిడార్లపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిస్తే బాగుంటుంది. దీర్ఘకాలికంగా ఆదాయం రాబట్టడంలో, దేశంలో గృహ నిర్మాణ సామాగ్రికి డిమాండ్ పెంచడంలో, పరిశ్రమల్లో నూతన ఆవిష్కరణలకు ఇది దోహదపడుతుంది. ఉద్యోగ కల్పనలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.' అని హెచ్ఐఎల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అక్షత్ సేత్ అన్నారు.
మోదీ 3.0 ప్రభుత్వ తొలి పూర్తిస్థాయి బడ్జెట్ జూలై 23న సమీపిస్తున్న వేళ, ఉద్యోగాల కల్పన అంశం తీవ్ర చర్చకు దారితీసింది. దేశంలో నిరుద్యోగ సమస్యను ఎంతవరకూ పరిష్కారిస్తారో చూడాలి. విద్య విధానాలు, ప్రజలను మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా చేయడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయం వంటి రంగాలలో ఉపాధి కల్పనపై దృష్టిపెట్టాలని అంటున్నారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఈ బడ్జెట్‌లో పరిష్కార చర్యలు చేపట్టాలి. నిర్మలా సీతారామన్ ఎలాంటి కొత్త ఫార్ములాలను చెబుతారో వేచి చూడాలి.