Expensive Areas : బెంగళూరులో ఈ ఏరియాలు చాలా కాస్ట్‌లీ.. హైదరాబాద్‌లో ఇవి
Bengaluru Most Expensive Areas : ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాలకు చాలా మంది వెళ్తుంటారు. కానీ ఇక్కడ ఇల్లు కొనాలి అన్నా.. అద్దెకు ఉండాలి అనుకున్నా ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నట్టుగా ధరలు ఉంటాయి. ప్రముఖ నగరాల్లో ధరలు బాగా పెరిగిన ఏరియాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది.
హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు మరికొన్ని నగరాలు చాలా కాస్ట్‌లీగా మారిపోయాయి. కొన్ని నగరాల్లో ఉండాలంటే చాలా ధరలు పెట్టాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ప్రకారం.. బెంగళూరులోని బగలూరులో గృహాల ధరలు 2020 నుండి అత్యధికంగా 90 శాతం పెరిగాయి. గత ఐదేళ్లలో చూసిన ట్రెండ్ ఆధారంగా ధరలను విశ్లేషించారు. 7 ప్రధాన నగరాల్లో ధరలు ఆకాశాన్నంటేలా పెరిగాయి. బెంగళూరులోని బగలూరు 2019 చివరి నుండి ఈ సంవత్సరం జూన్ మధ్య అత్యధికంగా 90 శాతం ధర పెరిగింది.
'బగలూరులో సగటు నివాస ధరలు 2019లో చదరపు అడుగులకు రూ. 4,300గా ఉండేది. H1 2024లో చ.అ.కు రూ. 8,151కి పెరిగాయి.' అని అనరాక్ ఛైర్మన్ అనూజ్ పూరి తెలిపారు.
బగలూరు మెుదటి ప్లేసులో ఉండగా.. ఇదే కాలంలో రెసిడెన్షియల్ ధరలు 80 శాతం పెరగడంతో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ఏరియా మూడో స్థానంలో నిలిచింది. సగటు ధరలు 2019లో చదరపు అడుగులకు రూ.4,765 నుండి H1 2024లో చదరపు అడుగులకు రూ.8,600కి పెరిగాయి. బెంగళూరులోని సర్జాపూర్ రోడ్ 58 శాతం ధరలతో 5వ స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటు ధరలు 2019లో చదరపు అడుగులకు రూ. 5,870 నుండి H1 2024లో చదరపు అడుగులకు రూ.9,300కి పెరిగాయి.
హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో
హైదరాబాద్‌లోని కోకాపేట 89 శాతం ధరతో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ధరలు 2019లో చదరపు అడుగులకు రూ.4,750 నుండి H1 2024లో చదరపు అడుగులకు రూ.9,000కి పెరిగాయి. బాచుపల్లి సగటు ధరలు 57 శాతం పెరిగి చ.అ.కు రూ. 3,690 నుండి రూ.5,800కి చేరి 6వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని తెల్లాపూర్ సగటు ధరలలో 53 శాతం పెరిగి 7వ స్థానంలో ఉంది. చదరపు అడుగులకు రూ. 4,819 నుండి రూ.7,350కి చేరుకుంది.
దిల్లీ ఎన్‌సీఆర్‌లో
దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే 79 శాతం సగటుతో 4వ స్థానంలో ఉంది. సగటు ధరలు 2019లో చదరపు అడుగులకు రూ. 5,359 నుండి H1 2024లో చదరపు అడుగులకు రూ.9,600కి పెరిగాయి. ఎన్‌సీఆర్‌లోని న్యూ గురుగ్రామ్ 9వ స్థానంలో ఉంది. సగటు ధరలు చదరపు అడుగుకు రూ.6,100 నుండి 48 శాతం పెరిగి రూ. 9,000కి చేరుకున్నాయి.
ముంబయిలోనూ భారీగా
ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్(MMR)లోని పన్వెల్ 50 శాతం ధరతో 8వ స్థానంలో ఉంది. ఇక్కడ ధర చదరపు అడుగులకు రూ.5,520 నుండి రూ. 8,300కి పెరిగింది. ఎంఎంఆర్ డోంబివిలి 10వ స్థానంలో నిలిచింది. 2019 చివరికి చదరపు అడుగులకు రూ. 6,625 నుండి రూ.9,300కి అంటే 40 శాతం వృద్ధి చెందాయి.
ధరల పెరుగుదలకు కారణాలు
బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌పై రియల్ ఎస్టేట్ నిర్మాణ, అభివృద్ధి సంస్థ BCD గ్రూప్ CMD అంగద్ బేడీ మాట్లాడారు. ఉత్తర బెంగళూరు, వైట్‌ఫీల్డ్, సర్జాపూర్ రోడ్‌లలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో గణనీయమైన ధరలు పెరగడానికి ఈ మైక్రోమార్కెట్‌లలో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కారణమని చెప్పవచ్చు అని అన్నారు. పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, విశ్రాంతి, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని, అగ్రశ్రేణి విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, IT కంపెనీల రాకతో ఈ ప్రదేశాలలో నివాస, అద్దెలకు డిమాండ్ పెరిగిందని తెలిపారు.
గురుగ్రామ్‌లో ప్రత్యేకించి ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే చుట్టూ ఉన్న నివాస ప్రాపర్టీల పెరుగుదలకు కారణాలను క్రిసుమి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ జైన్ వివరించారు. సమీప పరిసరాల్లో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ధరల పెరుగుదలకు కారణమన్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతంలో హౌసింగ్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. మరోవైపు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై క్రిసుమి కార్పొరేషన్ పెద్ద టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది.