Ratan Tata : ముంబయి నగరాన్ని సాయం కోరిన రతన్ టాటా.. ఆయనకు ఏం కావాలంటే
Ratan Tata Appeals For Help : రతన్ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వేల కోట్లకు అధిపతి. మంచి మనసున్న వ్యక్తి. అయితే ఆయన సాయం కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది.
వ్యాపార రంగంలో రతన్ టాటాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. ఎందరికో సాయం చేస్తారు. అలాంటి వ్యక్తి ముంబయి నగరాన్ని సాయం కోరారు. అయితే ఈ విషయం తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. కానీ ఆయన సాయం కోరింది ఓ శునకం కోసం. రతన్ టాటా ముంబైలోని ఆసుపత్రిలో చేరిన ఏడు నెలల శునకం కోసం రక్తదాతను కోరుతూ ప్రత్యేక పోస్ట్ చేశారు.
ముంబైలోని తన స్మాల్ యానిమల్ హాస్పిటల్లో చేరిన కుక్కకు రక్త దాతను కనుగొనడంలో సహాయం చేయాలని రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రజలను కోరారు. ఆ శునకం అవసరాలకు సంబంధించిన వివరాలను తన పోస్ట్‌లో పంచుకున్నారు. తన అభ్యర్థనకు సహాయం చేయాల్సిందిగా ముంబైని కోరారు.
రక్తహీనతతో చేరిన 7 నెలల కుక్కకు తమ జంతు ఆసుపత్రి వైద్య సిబ్బందికి రక్తం అవసరమని చెప్పారు. దాత కుక్కకు అర్హత ప్రమాణాలను కూడా చెప్పారు. దీంతో రక్తం అవసరమైన జంతువు ఫోటోతో షేర్ చేసిన రతన్ టాటా బ్లడ్ కావాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'ముంబై, నాకు మీ సహాయం కావాలి' అనే ఇన్స్టాగ్రామ్ స్టోరీలోని అదే ఫోటోను షేర్ చేశారు.
కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇప్పటికే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వేల సంఖ్యలో ప్రజల నుంచి బోలెడన్ని కామెంట్లు వచ్చాయి.
'కుక్కలకు సాయం చేయాలంటూ ఓ బిలియనీర్ రిక్వెస్ట్ పోస్టులు పెట్టడాన్ని ఊహించుకోండి' అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
'మోస్ట్ డౌన్ టు ఎర్త్ బిజినెస్ మ్యాన్' అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. 'రతన్ టాటా సార్ చేయగలిగితే, మేమెందుకు చేయలేం?' అని మరొకరు రాశారు.
ఆపదలో ఉన్న కుక్కకు సహాయం చేయడానికి రతన్ టాటా సోషల్ మీడియాను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఓ శునకాన్ని దాని యజమానులతో తిరిగి కలపడానికి ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించారు.
'ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో గత రాత్రి వదిలేసిన/ పోగొట్టుకున్న కుక్కను నా కార్యాలయం చూసింది. ఒకవేళ మీరు దాని సంరక్షకులు అయితే లేదా ఏవైనా ఆధారాలు ఉన్నట్లయితే, కొన్ని ఆధారాలతో దయచేసి reportlostdog@gmail.com ఇమెయిల్ చేయండి. అప్పటి వరకు కుక్క మా సంరక్షణలో ఉంటుంది. గాయాలకు చికిత్స పొందుతుంది..' అని గత సంవత్సరం పోస్ట్ చేశారు రతన్ టాటా.
టాటా ట్రస్ట్స్ నిర్వహించే స్మాల్ యానిమల్ హాస్పిటల్ పిల్లులు, కుక్కలకు పశువైద్య కేంద్రం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ఆసుపత్రి ఎన్నో కేసులను పరిష్కరించింది. చికిత్స చేయడానికి వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కలిసి పనిచేస్తుంది.