Best Child Investment Schemes : మీ పిల్లల మంచి భవిష్యత్ కోసం ఆరు బెస్ట్ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు ఇవే-six best child investment schemes in india with low risk high returns ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Child Investment Schemes : మీ పిల్లల మంచి భవిష్యత్ కోసం ఆరు బెస్ట్ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు ఇవే

Best Child Investment Schemes : మీ పిల్లల మంచి భవిష్యత్ కోసం ఆరు బెస్ట్ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు ఇవే

Bandaru Satyaprasad HT Telugu
Jul 24, 2024 01:43 PM IST

Best Child Investment Schemes : మీ పిల్లల విద్య, వివాహం, భవిష్యత్ అవసరాలకు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? అయితే మన దేశంలో ఉన్న ఆరు బెస్ట్ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ పథకాల గురించి మీకు తెలియజేస్తున్నాం.

మీ పిల్లల మంచి భవిష్యత్ కోసం ఆరు బెస్ట్ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు ఇవే
మీ పిల్లల మంచి భవిష్యత్ కోసం ఆరు బెస్ట్ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు ఇవే

Best Child Investment Schemes : తల్లిదండ్రులు నిత్యం ఆలోచించేది ఒక్కటే విషయం...పిల్లలు మనకంటే మెరుగైన స్థాయిలో ఉండాలి. అందుకే పిల్లలకు బెస్ట్ ఇచ్చేందుకు పేరెంట్స్ ప్రయత్నిస్తుంటారు. మీ పిల్లలకు మీరు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలంటే వారి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం. వారి ఉన్నత చదువుల కోసం, చక్కటి భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే వారి పేరుపై పెట్టుబడి పెట్టండి. మీ పిల్లల భవిష్యత్తును చక్కగా ప్లాన్ చేసేందుకు మన దేశంలో ఆరు ఉత్తమమైన చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు మీకు తెలియజేస్తున్నాం.

చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు వీలైనంత తొందరగా ప్రారంభించడం ముఖ్యం. మీ పిల్లల భవిష్యత్తును మంచి పెట్టుబడితో సెటప్ చేయడం చాలా ముఖ్యం. ఈ ప్లాన్లలలో ఎంత ముందుగా పెట్టుబడి పెడితే అంత పెద్ద మొత్తంలో రాబడి ఉంటుంది. చైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు ముఖ్యంగా ఉన్నత విద్య, వివాహాలు, హౌసింగ్ డిపాజిట్ మొదలైన వాటికి డబ్బు సమకూర్చడానికి కార్పస్‌గా సహాయపడుతుంది. తల్లిదండ్రులు తన భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నారని తెలుసుకున్న పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణను పెరుగుతుంది. పిల్లల విద్య, వివాహం, ఇతర ఖర్చులకు సంబంధించిన నిధులు సమకూర్చడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. సరైన ప్రణాళికతో పెట్టుబడి పెడితే మీ పిల్లలకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.

6 ఉత్తమ చైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు ఇవే

1. సుకన్య సమృద్ధి యోజన

2015లో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పొదుపు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ఆడ బిడ్డల విద్య, వివాహ అవసరాల కోసం డబ్బును ఆదా చేసుకునే పథకం. 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆడపిల్ల పేరుపై ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాతో పన్ను ప్రయోజనాలతో పాటు ప్రస్తుతం 8.3 శాతం వడ్డీ అందిస్తారు. ఈ పథకంలో సంవత్సరానికి గరిష్ట డిపాజిట్ పరిమితి రూ.1.5 లక్షలు, కనిష్టంగా రూ.250. ఆడ పిల్లలకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. ఆడ బిడ్డల వివాహం, చదువుల కోసం ఖర్చు కోసం ఈ డబ్బును ఉపసంహరించుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు వచ్చాక చదువు కోసమైతే సగం డబ్బులు తీసుకోవచ్చు. ఒక కుటుంబంలో రెండు సుకన్య సమృద్ధి స్కీమ్ ఖాతాలను మాత్రమే తెరవగలరు. పోస్టాఫీసు, బ్యాంకులలో ఈ ఖాతాలు తెరవవచ్చు.

2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను పొదుపు పెట్టుబడి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకంతో ఫిక్స్ డ్ రేటులో రాబడి, అదనంగా ఆదాయపు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పథకం పదిహేనేళ్ల మెచ్యూరిటీ సమయంతో 5 సంవత్సరాల దశలుగా అమలుచేస్తున్నారు. ప్రతి ఏడాది కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తు్న్నారు. వడ్డీ రేటును ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ పథకంలో మొత్తం మెచ్యూరిటీ, వడ్డీ రెండింటిపై పన్ను విధించరు. దీంతో పాటు సెక్షన్ 80C కేవలం రూ.1.5 లక్షల వరకు వార్షిక పెట్టుబడులపై పన్ను మినహాయింపులు ఉంటాయి. స్థిరమైన రాబడి, పన్ను ఆదా కోసం పీపీఎఫ్ పెట్టుబడి పథకం ఉత్తమం.

3. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ELSS)

పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెట్ స్కీమ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకం. చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ పథకాల్లో ఒకటి. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షలు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఈఎస్ఎస్ఎస్ ఫండ్‌లు మూడు ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ కలిగి ఉంటాయి. వీటిల్లో మూలధనంలో కనీసం 80 శాతం స్టాక్‌లలో పెట్టుబడి పెడతారు. ఈ ఫండ్‌లు ఇతర ఫిక్స్ డ్ ఇన్ కమ్ పథకాల కంటే ఎక్కువ రాబడిని అందించవచ్చు. అయితే వీటిల్లో రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఈ ఫండ్‌లు రిటైర్‌మెంట్ ప్లానింగ్‌ చేసుకునేందుకు మంచి ఎంపికలు. ఈఎల్ఎస్ఎస్ లు దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని అందిస్తాయి. అయితే వీటిపై మార్కెట్ ఒడిదొడుకులు ప్రభావం చూపుతాయి.

4.చైల్డ్ యూఎల్ఐపీలు(ULIP)

చైల్డ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఇవి పిల్లల కోసం ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ప్లాన్‌లు ఇన్సూరెన్స్ తో పాటు పిల్లల భవిష్యత్తు అవసరాల నిధులకు పెట్టుబడి మార్గాలను అందిస్తాయి. చైల్డ్ యూఎల్ఐపీలు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్‌లు ఉంటాయి. టర్మ్ వ్యవధిని మీరు నిర్ణయించుకోవచ్చు. 20 లేదా 30 సంవత్సరాల పాటు టర్మ్ వ్యవధి పెట్టుకుంటారు. మనం ఎంచుకున్న ఫండ్ ప్రకారం పెట్టుబడిని డెబిట్, ఈక్విటీ సెక్యూరిటీల మధ్య కేటాయిస్తారు. 18 ఏళ్ల తర్వాత విద్యకు సంబంధించిన అవసరాల కోసం నగదు కొంత మేర విత్ డ్రా చేసుకోవచ్చు. సెక్షన్ 80C ప్రకారం పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. చైల్డ్ యూలిప్ బీమా ప్రయోజనాలతో పాటు విద్య, వివాహానికి నిధులను సమకూర్చుకునేందుకు ఉపయోగపడతాయి.

5. చైల్డ్ మ్యూచువల్ ఫండ్ సిప్

పిల్లల భవిష్యత్తు ప్రణాళిక కోసం SIP ద్వారా కార్పస్‌ను ఏర్పాటుచేసుకునేందుకు నెలవారీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు 10 నుంచి 15 సంవత్సరాల కాల వ్యవధిలో కనీసం నెలకు రూ.500 చొప్పున చైల్డ్ SIPలను ప్రారంభించవచ్చు. ఇన్వెస్టర్ రిస్క్ టాలరెన్స్ ఆధారంగా సిప్ అమౌంట్ ను హైబ్రిడ్ లేదా ఈక్విటీ ఫండ్‌లకు కేటాయిస్తారు. ఈక్విటీ ఫండ్‌లు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులను అందించే అవకాశం ఉంటుంది. పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వివాహ సంబంధిత ఖర్చులకు లేదా విద్య కోసం కొంత నిధులు ఉపసంహరించుకోవచ్చు.

6. ఫిక్స్‌డ్ డిపాజిట్లు

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం వారి పేర్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయవచ్చు. ఈ ఎఫ్డీలు మార్కెట్ హెచ్చుతగ్గుల ఇబ్బందులు లేకుండా రాబడిని అందిస్తాయి. వడ్డీ రేట్లు 5.5% నుంచి 7% వరకు ఉంటాయి. ఎక్కువ కాల వ్యవధిలో (5-10 సంవత్సరాలు) ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తే ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఏడాదికి రూ. 2.5 లక్షలు వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. దీనిపై వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. FDలలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1000 కాబట్టి ఎవరైనా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. తల్లిదండ్రులు పిల్లల విద్య లేదా వైద్య అవసరాలకు ముందుగానే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అన్నింటి కంటే చైల్డ్ ఎఫ్డీలకు మార్కెట్ ప్రమాదాలు తక్కువ. ఎక్కువ కార్పస్‌ను ఏర్పాటుచేసుకునేందుకు సహాయపడతాయి.

Disclaimer : ఈ ఆర్టికల్ లోని సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు ఈ రంగంలోని నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం