October New Rules : అక్టోబర్ 1 నుంచి అమలయ్యే ఈ రూల్స్ గురించి తెలుసుకోండి
October New Rules : అక్టోబర్ నెల వచ్చేసింది. ప్రతీ నెలా కొన్ని రూల్స్ మారుతుంటాయి. అలాగే అక్టోబర్‌లోనూ కొన్ని రకాల రూల్స్ అమలవుతాయి. అవేంటో చూద్దాం..
సెప్టెంబర్ నెల ముగిసింది. అక్టోబర్ ప్రారంభమవుతుంది. ప్రతి నెల ఆర్థిక రంగంలో కొన్ని మార్పులతో ప్రారంభమవుతుంది. PF, ఆధార్ కార్డ్, చిన్న పొదుపు పథకాలు, గృహ రుణంపై వడ్డీ రేటు, LPG సిలిండర్, అనేక ఇతర మార్పులు సాధారణంగా ఉంటాయి. నెల ప్రారంభంలోనే వీటిని గుర్తిస్తే వచ్చే నెల ఆర్థిక ప్రణాళికను తదనుగుణంగా చేసుకోవచ్చు. అక్టోబర్ 1వ తేదీ మంగళవారం నుంచి ఆర్థిక రంగంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఆధార్ కార్డ్
పాన్ కార్డు కోసం కోసం దరఖాస్తు చేసేటప్పుడు లేదా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ IDని ఉపయోగించడానికి అక్టోబర్ 1 నుంచి అనుమతిలేదు. ఇందుకు సంబంధించి నిబంధనలలో సవరణలు చేశారు. అక్టోబర్ నుంచే అమల్లోకి రానుంది.
ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పులు
ఆదాయపు పన్నుపై సుప్రీంకోర్టు, హైకోర్టులు, వివిధ అప్పీలేట్ అధికారుల ముందు అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా అక్టోబర్ 1 నుంచి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ 'వివాద్ సే విశ్వాస్' అనే పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం జూన్ 22, 2024 నుండి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించే అవకాశాన్ని అందిస్తుంది.
వడ్డీలలో మార్పు
NSS పథకం కింద, పోస్టాఫీసుల్లోని చిన్న పొదుపు ఖాతాలలో పెద్ద మార్పు జరుగుతుంది. ఇది అక్టోబర్ 1 నుండి పొదుపుపై వడ్డీని ప్రభావితం చేస్తుంది. ప్రజలు దీని గురించి సమాచారాన్ని పొందడానికి పోస్టాఫీసులను సందర్శించవచ్చు.
ప్రత్యేక ప్రచారం
భారతీయ రైల్వే అక్టోబర్ 1 నుండి కొత్త ప్రచారాన్ని ప్రారంభించనుంది. రద్దీ ఎక్కువగా ఉండే వారాంతాల్లో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకోసం వారిని కనిపెట్టేందుకు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించింది.
చిన్న పొదుపు పథకం
పోస్టాఫీసుల్లో జాతీయ చిన్న మొత్తాల పొదుపు పథకం కింద ప్రారంభించిన నాన్-పెర్ఫార్మింగ్ ఖాతాలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. మైనర్‌ల పేరిట పీపీఎఫ్, తల్లిదండ్రులకు బదులు తాతలు తెరిచిన సుకన్య సమృద్ధి యోజన సహా మొత్తం 6 పథకాల కింద చెల్లని ఖాతాలను పరిశీలిస్తారు.
ఆస్తి అమ్మకం
స్థిరాస్తి విక్రయించే విషయంలో కేంద్రం పన్ను నిబంధనలను మార్చింది. అక్టోబర్ 1 నుంచి ఎవరైనా రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని అమ్మితే దానిపై 1 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ డ్రైవ్ స్కీమ్
అక్టోబర్ 1 నుంచి ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ అమల్లోకి వస్తుంది. ఈ పథకంలో భాగంగా టూ వీలర్, త్రీ వీలర్ కొనుగోలు చేసేవారికి రూ.0 వేల వరకు సబ్సిడీ ఉంటుంది.