Electric bike : సూపర్ స్టైలిష్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్- రియల్ టైమ్ ఫొటో ఇదిగో..
Royal Enfield electric bike launch date in India : రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌కి సంబంధించిన రియల్ టైమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంస్థ ఎండీ సిద్ధార్త్ ఈ బైక్‌ని నడుపుతూ కనిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ టీజర్‌ని విడుదల చేసింది. నవంబర్‌లో జరగనున్న ఈఐసీఎంఏ ఈవెంట్‌కి ముందు ఈ బైక్‌ని సంస్థ ఆవిష్కరించింది. ఇక ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌కి సంబంధించిన రియల్ టైమ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. బార్సిలోనా వీధుల్లో ప్రయాణిస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు సంబంధించిన తొలి స్పై షాట్‌ను ఎంసీఎన్ బంధించింది. ఈ బైక్ నడుపుతూ కనిపించింది మరెవరో కాదు రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్!
గత ఏడాది జరిగిన ఈఐసీఎంఏలో హిమాలయన్ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ ప్రదర్శించింది. అయితే ప్రస్తుతానికి దీనిని ఉత్పత్తిలోకి తీసుకురాబోమని సంస్థ ధృవీకరించింది. మోటార్ సైకిల్ భాగాలు, సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఎలక్ట్రిక్ టెస్ట్ బెడ్ ఉపయోగించడం జరిగింది.
ఎలక్ట్రిక్ అడ్వెంచర్ టూరర్‌కు బదులుగా రాయల్ ఎన్ఫీల్డ్ సిటీ మోటార్ సైకిల్‌తో ఈవీ సెగ్మెంట్ లోకి ప్రవేశించనుంది. టీజర్లో.. ఎలక్ట్రిక్ బైక్ పారాచూట్ల ద్వారా కింద పడేయడం కనిపించింది. రెండొవ ప్రపంచ యుద్ధంలో పెద్ద పాత్ర పోషించిన ఫ్లయింగ్ ఫ్లీ అనే బైక్‌ని సంస్థ ఇలాగే చూపించేది. బ్రాండ్ అదే పేరుతో నేమ్ ప్లేట్ పేటెంట్ కూడా దాఖలు చేసినందున, రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ పేరు "ఫ్లయింగ్ ఫ్లీ" అని పెట్టే అవకాశం ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదీ చూడండి:- Cheapest Bikes : ఎక్కువ మంది ఇష్టపడే తక్కువ ధరలోని బైక్స్.. 75 వేలలోపు ధర, 70 కి.మీ మైలేజీ!
ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ స్పై షాట్స్ ప్రకారం.. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, అడ్జెస్టెబుల్ బ్రేక్ లివర్లు, స్విచ్‌గేర్ వంటి కొన్ని భాగాలను గుర్తించవచ్చు. వీటిని ఇతర ఐసీఈ ఆధారిత రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల నుంచి తీసుకునున్నట్లు స్పై షాట్ల ద్వారా స్పష్టమవుతోంది. గుర్తించదగిన ఇతర భాగాలు రెక్టాంగ్యులర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది టీఎఫ్టీ స్క్రీన్‌గా ఉంటుంది. గొరిల్లా 450, హిమాలయన్ 450 ల్లో కూడా ఇది కనిపిస్తుంది. అయితే, ఈవీ సంబంధిత సమాచారాన్ని చూపించే విధంగా దీన్ని మర్చారు. ముందు భాగంలో గర్డర్ ఫోర్కులు ఉన్నాయి. వీటిని ఫ్లయింగ్ ఫ్లీలో ఉపయోగించారు.
రాబోయే రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్, స్పెసిఫికేషన్లు, బ్యాటరీ పరిమాణం గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ బైక్ సైజ్, స్లిమ్ డిజైన్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. రాయల్ ఎన్ఫీల్డ్ దీనిని సిటీ మోటార్ సైకిల్‌గా ఉంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుందని, కానీ బ్యాటరీ ప్యాక్ రిమూవబుల్ కాదని తెలుస్తోంది.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలను మేము మీకు అప్డేట్ చేస్తాము.
సంబంధిత కథనం