EV Road Side Assistance: ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారా! ఈ విషయాలు మరిస్తే అంతే సంగతులు ..
EV Road Side Assistance: పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. గత రెండు మూడేళ్లుగా దేశంలో ప్రధాన ద్విచక్ర ఉత్పత్తిదారులు ఈవీలను విక్రయిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినయోగించే క్రమంలో అసలు మరువకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.
EV Road Side Assistance: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దేశంలో అంతకంతకు పెరుగుతోంది. ప్రధాన బ్రాండ్ల వాహనాల విక్రయాల్లో స్థిరమైన వృద్ధి నమోదవుతోంది. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారులు ఈవీల తయారీపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు మూడేళ్లుగా ఈవీల వినియోగంలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే ప్రముఖ బ్రాండ్ల ఈవీలను కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలను అస్సలు విస్మరించకూడదు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల్లో ప్రముఖ బ్రాండ్లు వాటి విక్రయానంతర సేవల్ని కొనసాగించడానికి కూడా నిర్ణీత రుసుమును వసూలు చేస్తాయి. వాహనం కొనుగోలు చేసినపుడు ఏడాది వ్యవధితో చెల్లుబాటు అయ్యేలా సాంకేతిక సేవల్ని అందిస్తాయి. ఆ తర్వాత వాటి గడువు తీరిపోతుందని గుర్తుంచుకోవాలి.
ఎలక్ట్రిక్ వాహనాలకు రెండేళ్ళ క్రితం వరకు మూడేళ్ల వారంటీతో విక్రయించేవారు. గత ఏడాది కాలంగా ఆ వారంటీని ఐదేళ్లకు పొడిగించారు. ఈ వారంటీ బ్యాటరీ, మోటర్‌లకు వేర్వేరుగా ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధాన బ్రాండ్లుగా గుర్తింపు పొందిన టీవీఎస్ ఐక్యూబ్, చేతక్, ఓలా, ఏథర్ వంటి వాహనాలకు కొన్ని రకాల సేవలకు సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో వాయిస్ అలర్ట్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్స్, జీపీఎస్ లొకేషన్, జియోఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ వంటి సదుపాయాలకు వాహనంతో పాటు అందిస్తాయి. కొన్ని వాహనాల్లో జీపీఎస్ నావిగేషన్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ సేవలకు వాహనం ధరతో పాటు కలిపి వసూలు చేయడం వల్ల వాటి గురించి ప్రత్యేకంగా వివరించరు.
వాహనం కొనుగోలు చేసిన ఏడాది తర్వాత ఈ సేవలన్నీ ముగిసిపోతాయి. వాటిని ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి వీటిపై అవగాహన లేకపోవడంతో నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతులు సాధారణ బైక్ మెకానిక్‌ల మాదిరి ఎక్కడపడితే అక్కడ అందుబాటులో ఉండరు. వాహనాలకు సంబంధించిన సాంకేతిక వివరాలు లాగ్ మొత్తం సెన్సార్లు నమోదు చేస్తుంటాయి. ఛార్జింగ్ నుంచి ఎంత దూరంఎక్కడ తిరగారనే వివరాల వరకు ఈ సబ్ స్క్రిప్షన్లతో నమోదవుతుంటాయి. సబ్ స్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా వాహనాలను నడపడంలో ఎలాంటి ఇబ్బంది లేనందున చాలామంది ఆ ఖర్చు అనవసరమని భావిస్తుంటారు. కానీ వాహనం వారంటీ కొనసాగాలంటే ఈ సబ్‌స్క్రిప్షన్లు ఉపయోగపడతాయి.
రోడ్ సైడ్ అసిస్టెన్స్…
ఎలక్ట్రిక్ వాహనాల్లో మరో ప్రధానమైన సమస్య ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవరు చెప్పలేరు. ప్రస్తుతం రెండు రకాల ఈవీ ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఉన్నాయి. హబ్ మోటర్‌తో నడిచే వాహనాలు కొన్ని, మోటర్ బెల్ట్ ఆధారంగా నడిచేవి మరికొన్ని ఉన్నాయి. వీటి బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా అవి గరిష్టంగా 100 నుంచి 150 కి.మీ రేంజ్ ప్రయాణించడానికి ఉపయోగపడతాయి. అయితే ఏ ఎలక్ట్రిక్ వాహనమైనా ఎప్పుడు, ఎక్కడ ఎలా ఆగిపోతుందో ఎవరు చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.
సాధారణంగా వాహనాలు మొరాయించడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయ.బ్యాటరీ లేదా ఎలక్ట్రిక్ వైరింగ్ సర్క్యూట్‌లలో ఎక్కడైనా సమస్య ఉంటే డిస్ ప్లేలో ఎర్రర్ కనిపిస్తుంది. కొన్నిసార్లు వాటంతట అదే మాయం అవుతుంది.
ఎర్రర్ సింబల్ వచ్చినా వాహనం నడుస్తుందని వాడేస్తే అవి ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోతాయి. మరికొన్ని సందర్భాల్లో బ్యాటరీ 100శాతం చార్జ్ కాకపోవడం వంటి సమస్య తలెత్తవచ్చు. 80-90శాతంలోనే ఛార్జింగ్ ఆగిపోతున్నా త్వరలో తీవ్రమైన సమస్య ఎదురవుతుందనే సంకేతంగా భావించాలి.
ఈవీ వాహనాలు ప్రయాణంలో ఆగిపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా చాలా కంపెనీలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఈవీలు రోడ్లపై మొరాయిస్తే దగ్గర్లో ఉన్న సర్వీస్ సెంటర్‌కు తరలించే ఏర్పాటు ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఏటా నిర్ణీత రుసుము చెల్లించి బాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది యాక్టివేషన్‌లో ఉంటే 24గంటలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ సదుపాయం లభిస్తుంది. అనవసరపు ఖర్చుగా భావిస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఓసారి మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
ఫుల్ ఇన్స్యూరెన్స్…
వాహనాలకు ఫుల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కూడా మరువొద్దు. వాహనాల కొనుగోలు సమయంలో 5ఏళ్ల ఇన్సూరెన్స్ చెప్పి విక్రయిస్తుంటారు. నిజానికి అందులో తొలి ఏడాది మాత్రమే ఫుల్ ఇన్సూరెన్స్ మిగిలిన కాలానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. బండికి వారంటీ ఉన్నా రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, షార్ట్ సర్క్యూట్‌లు వంటి ప్రమాదాల్లో డామేజ్ అయితే అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఇన్సూరెన్స్ ఫోర్స్‌లో ఉంచుకోవడం ఉత్తమం.