Mahindra Thar Roxx Price : గ్రాండ్‌గా విడుదలకు మహీంద్రా థార్ రోక్స్ రెడీ.. ధర ఎంత, ప్రత్యేకతలు ఏంటి?
Mahindra Thar Roxx Price : మహీంద్రా థార్ రోక్స్ గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 15న విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ థార్ కు సంబంధించిన చాలా వార్తలు బయటకు వచ్చాయి. అయితే దీని ధర ఎంత ఉండవచ్చు? ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి?
మహీంద్రా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ. దేశీయ మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో కూడిన వివిధ కార్లను మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. పెద్ద సంఖ్యలో కస్టమర్లు కూడా ఇష్టంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ ఆఫ్ రోడ్ SUV 3-డోర్ థార్ భారీ డిమాండ్‌తో బాగా అమ్ముడవుతోంది. 5 డోర్ల మారుతీ సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖాలకు గట్టి పోటీని ఇచ్చేందుకు థార్ రోక్స్ ఆగస్టు 15న 5-డోర్ వేరియంట్‌లో SUVని విడుదల చేస్తుంది. ఈ కారు అంచనా ధర ఎంత? స్పెసిఫికేషన్స్ ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం..
కొత్త మహీంద్రా థార్ రోక్స్ 5-డోర్ SUV డిజైన్ గురించి చాలా వివరాలు అనేక టీజర్‌ల ద్వారా వెల్లడయ్యాయి. థార్‌లో 6-స్లాట్ గ్రిల్, కొత్త వృత్తాకార LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, LED ఫాగ్ ల్యాంప్స్, అధునాతన బంపర్, వినూత్నమైన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ కూడా వినూత్నంగా ఉండనుంది.
మహీంద్రా థార్ రోక్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిని వివిధ రంగులతో కూడా పరిచయం చేయవచ్చని అంచనా. అలాగే ఈ ఆఫ్-రోడ్ SUVలో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
ఈ థార్ రోక్స్ ఇంజన్, గేర్‌బాక్స్ గురించి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. కొత్త SUV 1.5-లీటర్ డీజిల్, 2.2-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను కలిగి ఉంటుందని అంటున్నారు. 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండవచ్చని అంచనా.
కొత్త మహీంద్రా థార్ రోక్స్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 10.25-అంగుళాల డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేను పొందనుందని చెబుతున్నారు. ఇది పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు.
కొత్త థార్ రోక్స్ ప్రయాణీకులకు రక్షణను అందిస్తుంది. కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 360-డిగ్రీ కెమెరాలను పొందే అవకాశం ఉంది.
మహీంద్రా థార్ రోక్స్ ఆఫ్-రోడ్ SUV చాలా సరసమైన ధరలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12.50 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ కారు మరికొద్ది గంటల్లో విడుదల అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి.