Tata Curvv EV Bookings : టాటా కర్వ్ ఈవీ బుకింగ్స్ ఓపెన్.. ఫుల్ ఛార్జింగ్‌తో ఈ కారు మైలేజీ 585 కిలో మీటర్లు
Tata Curvv EV Bookings : భారత ఆటోమెుబైల్ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ది మెుదటి స్థానం. ఈ కంపెనీ కొత్తగా టాటా కర్వ్ ఈవీని లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కంపెనీ శుభవార్త చెప్పింది.
టాటా కర్వ్ ఈవీ కొనాలని చూసేవారికి గుడ్ న్యూస్. ఈ కారును బుక్ చేసుకునేందుకు సమయం వచ్చేసింది. ఆగస్టు 12 నుంచి బుకింగ్ మెుదలయ్యాయి. టాటా మోటార్స్ నమ్మకమైన ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. ఇటీవల కర్వ్ EVని మార్కెట్‌లో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఇది స్టైలింగ్, ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ కూపే SUV. ఈ కారు బుకింగ్ ఆగస్టు 12 నుంచి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
టాటా కర్వ్ ఈవీ కొనాలి అనుకుంటే.. కస్టమర్‌లు సరికొత్త కర్వ్ ఎలక్ట్రిక్ కారును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ సమీపంలోని టాటా డీలర్‌షిప్‌ని సందర్శించాలి. రూ.21,000 ముందస్తు చెల్లింపు చేసి బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 14న టెస్ట్ డ్రైవ్ ప్రారంభం కాగా ఆగస్టు 23 నుంచి డెలివరీలు మెుదలవుతాయి.
టాటా కర్వ్ EV ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇందులో క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ప్లస్ ఎ అనే 5 వేరియంట్‌లు ఉన్నాయి. ఇది ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే వంటి వివిధ రంగులలో కూడా అందుబాటులో ఉంది.
ఈ కారులో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 45 kWh (kWh) బ్యాటరీని కలిగి ఉన్న వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 502 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 150 PS పవర్, 215 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 55 kWh (kWh) బ్యాటరీ ప్యాక్‌ని పొందే వేరియంట్ పూర్తి ఛార్జ్‌తో 585 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 167 PS శక్తిని, 215 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేయగలదు. DC ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికపై కర్వ్ EV బ్యాటరీ 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 40 నిమిషాలు పడుతుంది.
కొత్త కర్వ్ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 9-స్పీకర్ JBL-సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. టాటా కర్వ్ EV భద్రతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.