Kia Carens EV : కియా క్యారెన్స్​కు ఈవీ టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే!-kia carens ev in the works first spied testing in south korea check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Carens Ev : కియా క్యారెన్స్​కు ఈవీ టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Kia Carens EV : కియా క్యారెన్స్​కు ఈవీ టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu
Apr 14, 2023 10:05 AM IST

Kia Carens EV : కియా క్యారెన్స్​ ఈవీకి సంబంధించి ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఇక ఈ మోడల్​ 2025లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

 కియా క్యారెన్స్​కు ఈవీ టచ్​..
కియా క్యారెన్స్​కు ఈవీ టచ్​..

Kia Carens EV : ఇప్పుడు ప్రపంచమంతా 'ఈవీ'వైపు అడుగులు వేస్తోంది. ప్రజల్లో ఎలక్ట్రిక్​ వాహనాలపై ఆసక్తి కూడా పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు తమ ఈవీ పోర్ట్​ఫోలియోను పెంచుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే.. సౌత్​ కొరియా దిగ్గజ ఆటోమొబైల్​ కంపెనీ కియా మోటార్స్​.. తన బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​ అయిన క్యారెన్స్​కు ఈవీ వర్షెన్​ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కియా క్యారెన్స్​ ఈవీని సౌత్​ కొరియాలో ఇటీవలే టెస్ట్​ చేసింది ఆ సంస్థ. ఇందుకు సంబంధించిన లీక్డ్​ ఫొటోలు ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి.

కియా క్యారెన్స్​ ఈవీ.. లాంచ్​ ఎప్పుడంటే..

ఇండియా మార్కెట్​లోనూ కియా మోటార్స్​ వాహనాలకు మంచి డిమాండ్​ ఉంది. ఈ సంస్థ సేల్స్​ నెలనెలా భారీగా పెరుగుతూ ఇతర కంపెనీలకు గట్టిపోటీనిస్తున్నాయి. ఇక కియా క్యారెన్స్​కు '2022 ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​' అవార్డు కూడా లభించింది. ఈ మోడల్​కు డిమాండ్​ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇక కియా క్యారెన్స్​ ఈవీ.. 2025లో అంతర్జాతీయంగా లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ ఎంపీవీ ఇండియాలోకి అడుగుపెట్టొచ్చు.

Kia Carens EV price : ఇక ఆన్​లైన్​లో లీక్​ అయిన ఫొటోలను చూస్తుంటే.. కియా క్యారెన్స్​లో భారీ మార్పులే జరిగినట్టు కనిపిస్తోంది! డిజైన్​ చాలా ప్రత్యేకంగా, ఈవీ స్పెసిఫిక్​గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడున్న మోడల్​తో పోల్చుకుంటే.. క్యారెన్స్​ ఈవీ అలాయ్​ వీల్స్​తో పాటు ఇతర భాగాల స్టైలింగ్​ ఇంకా మెరుగ్గా ఉండొచ్చు.

కియా క్యారెన్స్​ ఈవీ బ్యాటరీ, ఇంజిన్​ వంటి వివరాలపై ఇంకా ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. రానున్న రోజుల్లో వీటిపై ఓ స్పష్టత వస్తుంది. అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. కియా క్యారెన్సీ ఈవీ.. మరో దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హ్యుందాయ్​కు చెందిన క్రేటా ఈవీని పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న కియా క్యారెన్స్​ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​.. క్రేటా, సెల్టోస్​ను పోలి ఉండటంతో.. ఈవీకి కూడా ఇదే కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి.

మరిన్ని మోడల్స్ కూడా​..!

Kia Carens EV launch in India : ప్రస్తుతం కియా క్యారెన్స్​ ప్రొడక్షన్​ ఇండియాలో కూడా జరుగుతోంది. వీటిని గ్లోబల్​ మార్కెట్​కు ఎక్స్​పోర్ట్​ కూడా చేస్తోంది సంస్థ. ఈ నేపథ్యంలో క్యారెన్స్​ ఈవీ ఇండియా లాంచ్​ అనివార్యం అని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దాని కన్నా ముందు.. మరికొన్ని మోడల్స్​ను ఇండియాలో లాంచ్​ చేసేందుకు కియా మోటార్స్​ ప్లాన్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఇందులో ఒకటి. ఇది ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో అడుగుపెట్టింది. ఇక ఇండియాలో డిసెంబర్​లో లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత కథనం