Income Tax refund: ఈ రెండు కేటగిరీలకు రీఫండ్ ఇవ్వలేకపోతున్నాం: ఆదాయ పన్ను విభాగం
Income Tax refund: 2023 -24 ఎసెస్ మెంట్ సంవత్సరానికి గానూ ఐటీఆర్ (ITR) లు దాఖలు చేసినవారికి రీఫండ్ జారీ విషయంలో ఆదాయ పన్ను విభాగం కీలక ప్రకటన చేసింది. రెండు కేటగిరీల వారికి రీఫండ్ (Income Tax refund) ఇవ్వలేకపోతున్నామని వివరించింది.
Income Tax refund: 2023 -24 ఎసెస్ మెంట్ సంవత్సరానికి గానూ ఆదాయపన్ను రిటర్న్స్ (ITR), వెరిఫికేషన్స్, రీఫండ్స్ (Income Tax refund) పై ఆదాయ పన్ను విభాగం మంగళవారం కీలక ప్రకటన చేసింది.ఐటీఆర్ ల ప్రాసెసింగ్ సమర్ధవంతంగా, వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించింది.
మొత్తం 6.98 కోట్లు..
2023- 24 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం మొత్తం 6.98 కోట్ల ఐటీఆర్ లు దాఖలయ్యాయని భారత ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. వాటిలొ 6.84 కోట్ల ఐటీఆర్ ల వెరిఫికేషన్ పూర్తయిందని తెలిపింది. అందులో 6 కోట్లకు పైగా ఐటీఆర్ ల ప్రాసెసింగ్ కూడా పూర్తయిందని తెలిపింది. ఇప్పటివరకు 2.45 కోట్ల ఐటీఆర్ లకు సంబంధించిన రీఫండ్ ప్రక్రియ కూడా ముగిసిందని వెల్లడించింది. ఐటీఆర్ ల సగటు ప్రాసెసింగ్ టైమ్ ను 10 రోజులకు తగ్గించామని, 2019-20 లో అది 82 రోజులుగా ఉండేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) తెలిపింది.
ఈ రెండు కేటగిరీలకు..
ఐటీఆర్ లు దాఖలు చేసిన వారిలో ఈ రెండు కేటగిరీల వారికి రీఫండ్ చెల్లించలేకపోతున్నామని సీబీడీటీ తెలిపింది. వాటిలో ఒకటి వెరిఫికేషన్ పూర్తి కాని ఐటీఆర్ లు కాగా.. మరొకటి, పన్ను చెల్లింపుదారు నుంచి మరింత అదనపు సమాచారం అవసరమైన ఐటీఆర్ లు అని వెల్లడించింది. అదనపు సమాచారం కావాలని ఆ పన్ను చెల్లింపుదారుకు సమాచారం పంపించామని, వారి నుంచి సంతృప్తికరమైన సమాచారం లభిస్తే, రీఫండ్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు 14 లక్షల ఐటీఆర్ ల వెరిఫికేషన్ పూర్తి కాలేదని తెలిపింది. అలాగే, 12 లక్షల ఐటీఆర్ లకు అదనపు సమాచారం కావాలని కోరామని వెల్లడించింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ ఖాతాలను వ్యాలిడేట్ చేయకపోవడం వల్ల కూడా వారికి రీఫండ్ చేయలేకపోతున్నామని వివరించింది.