Minor Pan Card : పిల్లలకు కూడా పాన్ కార్డ్.. అప్లై చేసే విధానం.. ఇది ఎలా ఉపయోగపడుతుంది?-how to apply pan card to childrens and how it useful minor pan card process ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Minor Pan Card : పిల్లలకు కూడా పాన్ కార్డ్.. అప్లై చేసే విధానం.. ఇది ఎలా ఉపయోగపడుతుంది?

Minor Pan Card : పిల్లలకు కూడా పాన్ కార్డ్.. అప్లై చేసే విధానం.. ఇది ఎలా ఉపయోగపడుతుంది?

Anand Sai HT Telugu
Jul 21, 2024 02:46 PM IST

Minor Pan Card Application : పాన్ కార్డ్ అనేది ఈ కాలంలో తప్పనిసరైపోయింది. అయితే మైనర్లు కూడా పాన్ కార్డు తీసుకోవడం మంచిది. దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

మైనర్ పాన్ కార్డు
మైనర్ పాన్ కార్డు

ఏ ఆర్థిక లావాదేవీకైనా పాన్ కార్డు తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉండాలనే నిబంధన ఉంది. ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. భారతదేశంలో పన్ను చెల్లింపుదారులందరికీ 10-అంకెల గుర్తింపు సంఖ్య లేదా PAN (PAN) నంబర్ ఉంటుంది. పాన్ కార్డ్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే తప్పనిసరి అధికారిక పత్రం.

పాన్ కార్డ్ పెద్దలకు మాత్రమే కాదు. పిల్లలకు కూడా చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖలోని సెక్షన్ 160 ప్రకారం, పాన్ కార్డు జారీ చేయడానికి కనీస వయస్సు లేదు. అందువల్ల, మైనర్లు కూడా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాదు ఐదేళ్లలోపు పిల్లలు కూడా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు స్వయంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోలేరు కాబట్టి.. పిల్లల తరపున తల్లిదండ్రులు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి.

పిల్లలకు పాన్ కార్డ్ అవసరం ఎప్పుడు?

తల్లిదండ్రులు పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఏ పిల్లలకైనా పాన్ కార్డ్ అవసరం. ఇది కాకుండా మీరు మీ బిడ్డను మీ పెట్టుబడికి నామినీగా చేసినప్పుడు, మైనర్‌లకు కూడా పాన్ కార్డ్ అవసరం. పిల్లల పేరుతో బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు లేదా మైనర్ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన(SSY) ఖాతాను తెరిచేటప్పుడు, మీరు పిల్లల పాన్ కార్డ్ వివరాలను అందించాలి. ప్రత్యేక పరిస్థితులలో ఒక మైనర్ ఉద్యోగం చేస్తూ ITR ఫైల్ చేయవలసి వస్తే వారికి పాన్ కార్డ్ పొందవచ్చు. ITR ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ కలిగి ఉండటం అవసరం.

మైనర్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మాత్రమే వారి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్ కార్డ్ కోసం దరఖాస్తు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు.

పాన్ కార్డ్ కోసం అవసరమైన పత్రాలు

1. తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు రుజువు

2. దరఖాస్తుదారు గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్ / రేషన్ కార్డ్ / పాస్‌పోర్ట్)

3. చిరునామా రుజువు (ఆధార్ ) కార్డ్ / పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్ / ఆస్తి నమోదు పత్రం మొదలైనవి.

ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి?

ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఫారమ్ 49A డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సూచనలు జాగ్రత్తగా చదవాలి. కేటగిరీ సెలక్ట్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి. పిల్లల వయసు సర్టిఫికేట్, అవసరమైన డాక్యుమెంట్స్, తల్లిదండ్రుల ఫోటో అప్లోడ్ చేసేయండి. తల్లిదండ్రుల సంతకాన్ని కూడా చెప్పిన ఫార్మాట్ ప్రకారం అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ఆఫ్‌లైన్‌లో ఎలా చేయాలి?

అధికారిక వెబ్‌సైట్ లేదా ఎన్‌ఎస్‌డీఎల్ ఆఫీస్ నుంచి 49A తీసుకోవాలి. తర్వాత అన్ని వివరాలు నింపాలి. పిల్లల రెండు ఫొటోలు, డాక్యుమెంట్స్, అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫారమ్, డాక్యుమెంట్లు, ఫీజ్ దగ్గరలోని ఎన్‌ఎస్‌డీఎల్ ఆఫీసులో ఇవ్వాలి. ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత మీ అడ్రస్‌కు పాన్ కార్డు వస్తుంది.

మైనర్లకు జారీ చేసిన పాన్ కార్డు 18 ఏళ్ల తర్వాత అప్‌డేట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల ఫోటో లేదా సంతకాన్ని అందులో కలిగి ఉండదు. అటువంటి పరిస్థితిలో ఇది ఐడెంటీ ప్రూఫ్‌గా పని చేయదు. 18 సంవత్సరాలు నిండినప్పుడు పాన్ కార్డును పునరుద్ధరించడానికి దరఖాస్తు చేసుకోవాలి.

Whats_app_banner