Aadhaar and PAN: చిన్న మొత్తాల పొదుపు ఖాతాలకు ఆధార్, పాన్ కార్డులు తప్పనిసరా? ఈ విషయాలు తెలుసుకోండి.
Aadhaar and PAN: పీపీఎఫ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన.. వంటి స్మాల్ సేవింగ్స్ అకౌంట్లు తెరవడానికి ఆధార్ తప్పని సరిగా ఉండాలా? అన్న ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది. ఈ విషయంపై కేంద్రం ఇటీవల వివరణ ఇచ్చింది.
Aadhaar and PAN: ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ పంచుకున్న నోటిఫికేషన్ ప్రకారం, చిన్న మొత్తాల పొదుపు ఖాతాను తెరవడానికి ఆధార్ తప్పని సరి. అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసే పౌరులు ఆధార్ ను ఐడెంటిటీ ప్రూఫ్ గా అందించడం ఇప్పుడు తప్పనిసరి.
ఆధార్ నెంబర్ లేకపోతే ఎలా?
ఒకవేళ ఎవరికైనా ఆధార్ (Aadhaar) నంబర్ లేకపోతే, వారు ఆధార్ కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కు దరఖాస్తు చేసుకున్నట్లుగా చూపే పత్రాన్ని ఏదైనా పొదుపు పథకాల్లో కొత్త ఖాతా తెరవడానికి రుజువుగా ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్ వచ్చిన తరువాత ఆధార్ (Aadhaar) నంబర్ ను ఐడెంటిటీ ప్రూఫ్ గా సమర్పించాల్సి ఉంటుంది.
ఖాతా తెరవడానికి మీరు ఆధార్ నంబర్ ను ఎప్పుడు ఇవ్వాలి?
ఖాతా తెరిచిన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధిలో ఖాతాదారుడు ఆధార్ నంబర్ ను సంబంధిత అకౌంట్స్ కార్యాలయానికి అందించాలి. అలా చేయని పక్షంలో ఆధార్ (Aadhaar) నంబర్ సమర్పించే వరకు అతని సేవింగ్స్ ఖాతా పనిచేయడం ఆగిపోతుంది.
స్మాల్ సేవింగ్స్ ఖాతాలకు కూడా పాన్ కార్డు అవసరమా?
చిన్న మొత్తాల పొదుపు ఖాతాను ఓపెన్ చేసే సమయంలో, అర్హులైన వ్యక్తులు తమ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN card) ను కూడా అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతా తెరిచే సమయంలో పాన్ ను సమర్పించని పక్షంలో కింద పేర్కొన్న పరిస్థితుల్లో, రెండు నెలల్లోగా పాన్ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.
(1) ఖాతాలో బ్యాలెన్స్ ఏ సమయంలోనైనా యాభై వేల రూపాయలకు మించితే లేదా
(ii) ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఖాతాలోని అన్ని క్రెడిట్ లు లక్ష రూపాయలకు మించితే; లేదా
(3) ఖాతా నుండి ఒక నెలలో అన్ని ఉపసంహరణలు, బదిలీల మొత్తం పది వేల రూపాయలు దాటితే పాన్ ను సమర్పించాల్సి ఉంటుంది.