Economic Survey 2024: ఎకనామిక్ సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బడ్జెట్ సమావేశాల సమయంలో పార్లమెంటుకు సమర్పిస్తుంది. సాధారణంగా ఎకనమిక్ సర్వే అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తుంది. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకు స్వల్ప, మధ్యకాలిక అవకాశాలను కూడా వివరిస్తుంది. కేంద్ర బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటు పరిశీలన కోసం ప్రవేశపెడతారు. 1950-51లో తొలి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 1964 వరకు దీనిని కేంద్ర బడ్జెట్ తో పాటు ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత దానిని వేరు చేసి బడ్జెట్ (BUDGET 2024) కు ముందురోజు ప్రవేశపెట్టడం ప్రారంభించారు.
ఆర్థిక సర్వే (Economic Survey) అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేసి సమర్పించే సమగ్ర వార్షిక పత్రం. కేంద్ర బడ్జెట్ కు ఒక రోజు ముందు దీనిని పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పనితీరు వివరణాత్మక అవలోకనాన్ని ఈ సర్వే అందిస్తుంది. జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి, ద్రవ్యలోటు వంటి పారామీటర్లకు సంబంధించిన గణాంక డేటాను కలిగి ఉంటుంది. ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి విధానపరమైన చర్యలను కూడా ఈ డాక్యుమెంట్ సూచిస్తుంది.
ఆర్థిక సర్వేను భారత ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA), ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అతని / ఆమె బృందం తయారు చేస్తుంది. దీనిని భారత ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు.
ఆర్థిక సర్వే విధాన నిర్ణేతలకు దేశ ఆర్థిక పరిస్థితిపై ఒక స్పష్టమైన అవగాహనను అందిస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన ఆర్థిక పరమైన నిర్ణయాలపై సిఫార్సులను అందిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆబ్జెక్టివ్ గా విశ్లేషించి, పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. ఇది దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అవకాశాల గురించి తెలియజేస్తుంది.