కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను భారత్ లో స్థానికంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త ఈవీ పాలసీ (New EV policy) ని రూపొందించారు. ఈ కొత్త ఈవీ విధానంతో విదేశీ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులు భారతదేశంలోకి ఎగుమతి చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ దిగుమతి పన్ను సుంకాలు ఉండనున్నాయి.
భారతదేశంలో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లపై పన్ను ప్రయోజనాన్ని పొందడానికి మార్గదర్శకాలు, అర్హతలను వివరిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్చి 15న నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ఈవీ విధానం (New EV policy) లోని ముఖ్యాంశాలు ఇవీ..
విదేశీ కార్ల తయారీదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకంపై భారత్ తన విధానాన్ని మార్చబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకో, దాని ప్రయోజనాలకో అనుగుణంగా విధానాలను రూపొందించదు’’ అని ఆయన స్పష్టం చేశారు. భారత్ కొత్త ఈవీ విధానాన్ని (New EV policy) ప్రకటించడంతో.. టెస్లా వంటి విదేశీ కార్ల తయారీ సంస్థలు ఇండియాలో ఈవీల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన ఈవీ తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు గత కొన్నేళ్లుగా తక్కువ దిగుమతి పన్ను కోసం లాబీయింగ్ చేస్తోంది. ఈ దిశగా కొంత కాలంగా కంపెనీ, కేంద్రం మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు కూడా జరిగాయి. ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్నును తగ్గించవద్దని, స్థానిక తయారీదారులకు సమాన అవకాశాలు కల్పించాలని భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ గతంలో కేంద్రాన్ని కోరింది.
టెస్లా సీఈఓ, వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా, భారతదేశంలో టెస్లా కార్ల ఉత్పత్తిని ప్రారంభించడానికి ఆయన మరోసారి ఆసక్తి చూపారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా యూఎస్ లోని టెస్లా ఫెసిలిటీని సందర్శించారు. అమెరికాకు చెందిన ఈవీ తయారీ సంస్థ టెస్లా.. గ్లోబల్ మార్కెట్లో మోడల్ 3, మోడల్ ఎస్, మోడల్ వై, మోడల్ ఎక్స్ వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తోంది.