Banks privatization : ప్రైవేటీకరణ 'లిస్ట్'లో మరిన్ని బ్యాంకులు.. కేంద్రం కసరత్తు!
Banks privatization : బ్యాంకుల ప్రైవేటీకరణ లిస్ట్‌లో మరికొన్ని సంస్థలు చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు.. ప్రభుత్వం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Banks privatization : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ప్రవేటీకరించేందుకు కేంద్రం ఇప్పటికే ఒక లిస్ట్‌ను తయారు చేసుకుంది. కానీ ఇప్పుడు.. ఆ జాబితాలోకి మరిన్ని బ్యాంక్‌లను చేర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఓవైపు ప్రభుత్వ ఆధారిత బ్యాంక్‌ల లాభాలు పెరుగుతుండటం, మరోవైపు మొండి బకాయిలు దిగొస్తుండటం ఇందుకు కారణం అని తెలుస్తోంది.
మరిన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ..?
బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంపై 2021-22 బడ్జెట్ సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఐడీబీఐ బ్యాంక్‌తో పాటు మరో రెండు ప్రభుత్వ ఆధారిత బ్యాంక్‌లను ప్రైవేట్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించి.. నీతీఆయోగ్ కొన్ని సూచనలు చేసింది. కాగా.. మీడియా కథనాల ప్రకారం.. ఆ రెండు బ్యాంకుల పేర్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.
అయితే.. పలు శాసనపరమైన సమస్యల కారణంగా ఆయా బ్యాంకుల ప్రైవేటీకరణ ఇంకా జరగలేదు. ఇక తాజాగా ఆర్థికశాఖ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. మరి కొన్ని బ్యాంక్‌లను ప్రైవేటైజేషన్ చేయాలని కేంద్రం చూస్తోంది. ఆర్థికశాఖ, నీతిఆయోగ్, ఆర్బీఐలోని సభ్యులు.. సమావేశమై.. కొత్త లిస్ట్‌ను రూపొందిస్తారు!
privatization of banks in India : "పలు మిడ్, స్మాల్ సైజ్ బ్యాంకుల ప్రైవేటీకరణ విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్యానెల్ ఏర్పడనుంది. ఆయా బ్యాంకుల్లో ప్రభుత్వం.. తన వాటా ఎంత తగ్గించుకోవాలి? అన్న విషయాన్ని కూడా ఈ ప్యానెల్ నిర్ణయిస్తుంది," అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా.. ఈ విషయంపై ఆర్థికశాఖ ఇంకా స్పందించలేదు. బ్యాంకుల ప్రైవేటీకరణ లిస్ట్‌ను పెంచేందుకు ప్యానెల్ ఏర్పడినా.. 2024 లోక్‌సభ ఎన్నికల సమీపిస్తుండటంతో.. ప్రైవేటైజేషన్ ప్రక్రియ ఇప్పట్లో మొదలవ్వకపోవచ్చు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ విషయంపై ముందడుగు పడొచ్చు.
అయితే.. బ్యాంకుల ప్రైవేటీకరణ జాబితాను తయారు చేసే ముందు కొన్ని కీలక అంశాలను కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలుస్తోంది. బ్యాంకుల బలాలు, బలహీనతలతో పాటు కొన్నేళ్లుగా వాటి ప్రదర్శన వంటివి పరిగణిస్తుంది.
వాస్తవాలు మాట్లాడుకోవాలంటే.. పీఎస్‌యూ బ్యాంక్స్ పనితీరు గత కొన్ని త్రైమాసికాలుగా మెరుగుపడుతూ వస్తోంది. లాభాలు జోరందుకున్నాయి. మొండిబకాయిలు దిగొస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 12 పీఎస్‌యూ బ్యాంక్‌ల నెట్ ప్రాఫిట్ రూ. 34,418కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది రూ. 15,307గా ఉండేది. అంతేకాకుండా పీఎస్‌యూల అసెట్ క్వాలిటీ కూడా వేగంగా వృద్ధిచెందుతోంది. ఈ విధంగా ప్రభుత్వ ఆధారిత బ్యాంకుల ప్రదర్శన, పనితీరు మెరుగుపడుతుండటంతో.. వాటి ప్రైవేటీకరణకు ఇదే మంచి తరుణం అని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
Banks privatization Government of India : కానీ బ్యాంకుల ప్రవేటీకరణకు ముందు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. అనేక చట్టాలను సవరించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ కంపెనీ యాక్ట్ 1970, 1980 వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ సవరణల తర్వాతే సంబంధిత లిస్ట్.. కేబినెట్ ముందుకు వెళుతుంది. కేబినెట్ ఆమోదంతో పనులు మరింత వేగవంతమవుతాయి. అయితే.. ఇవన్నీ 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇండియాలో ప్రస్తుతం.. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనెరా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లు.. ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి.
సంబంధిత కథనం