GVL On Steel Plant : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తుతానికి లేదన్న జివిఎల్, ఎన్నికలే కారణం?
GVL On Steel Plant: విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీ జివిఎల్ నరసింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్టేనని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకు రావడానికి కృషి చేయాలని కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు.
GVL On Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడే జరగదని, సంస్థను సరిగా నడిచేలా చూడటం విశాఖ ప్రజలకు మాత్రమే కాదు, దేశానికి కూడా ముఖ్యమేనని జివిఎల్ చెప్పారు. స్టీల్ ప్లాంట్‌లో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ యూనిట్‌లో కూడా ఉత్పత్తిలోకి తీసుకు రావడం ద్వారా ప్రస్తుత సమస్యల నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఐరన్ ఓర్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తుతానికి నిలిచిపోయినట్టేనని ఎంపీ జివిఎల్ నరసింహరావు చెప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయిందని, ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంటును కొనసాగించాలంటే దానిని లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల ఆస్తిగా ఉన్న పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్టీల్ ప్లాంటు నష్టాలతో పాటు ఐరన్ ఓర్ గనులను కేటాయించకపోవడానికి మోదీ ప్రభుత్వ హయంలో చేసినవి కాదన్నారు. ప్లాంటును కాపాడే విషయంలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని కార్మిక సంఘాలకు జివిఎల్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ హయంలో ప్లాంటు నిర్వహణ విషయంలో మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ కారణంగానే పరిశ్రమ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తాయని ఆరోపించారు. త్వరలో స్టీల్ ప్లాంటులో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ యూనిట్ ప్రారంభిస్తామని చెప్పారు. రాయబరేలీలో ఉన్న రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ ద్వారా రూ.2వేల కోట్ల మూలధనాన్ని సేకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్‌ఎండిసి ఆధ్వర్యంలో పిల్లెట్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
బుధవారం విశాఖలో జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగనియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కులస్తే పాల్గొనాల్సి ఉంది. చివరి నిమిషంలో కేంద్ర మంత్రి పర్యటన వాయిదా పడింది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న జివిఎల్ నరసింహరావు కొంతకాలంగా అక్కడే మకాం వేశారు. స్థానికంగా పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో జివిఎల్ తాజా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు తాత్కలికంగా ప్రైవేటీకరణ ప్రతిపాదనల్ని వాయిదా వేసినట్టు చెబుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.