‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి-apple watch 7 saved my life delhi based researcher emails apple ceo tim cook responds ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

HT Telugu Desk HT Telugu
May 03, 2024 08:49 PM IST

మానవ జీవితాల్లో టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేసే విషయం ఇది. సరైన సమయంలో అలర్ట్ చేసి, ఆపిల్ వాచ్ 7 ఢిల్లీలో ఒక యువతి ప్రాణాలను కాపాడింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా హార్ట్ రేట్ పెరిగిన విషయాన్ని గుర్తించి, వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆ యువతికి ఆపిల్ వాచ్ 7 హెచ్చరించింది.

స్నేహ సిన్హాకు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ రిప్లై
స్నేహ సిన్హాకు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ రిప్లై (Debashis Sarkar)

ఢిల్లీకి చెందిన పాలసీ రీసెర్చర్ స్నేహా సిన్హాకు ఇటీవల ఆపిల్ వాచ్ 7 గిఫ్ట్ గా అందింది. అది చాలా ట్రెండీగా ఉండి, బాగా నచ్చడంతో ఆ వాచ్ ను వాడడం ప్రారంభించింది. ఆ ఆపిల్ వాచ్ 7 లోన అక్యురేట్ హార్ట్ రేట్ మానిటర్ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook) కు ఆమె తెలియజేసి, తన ధన్యవాదాలు తెలిపింది.

నిమిషానికి 250 కి పైగా బీట్స్..

ఒకరోజు రాత్రి సమయంలో తన చేతికి ధరించి ఉన్న ఆపిల్ వాచ్ 7 లోని హార్ట్ బీట్ మానిటర్ స్నేహ సిన్హాను అలర్ట్ చేసింది. ఆమె హార్ట్ బీట్ నిమిషానికి 250 బీట్స్ కు పైగా కొట్టుకుంటోందని, ఇది చాలా అసాధారణమని, వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆపిల్ వాచ్ 7 (Apple watch 7) ఆమెకు సూచించింది. దాంతో, మర్నాడు మార్నింగ్ హాస్పిటల్ కు వెళ్దామనుకున్న స్నేహ.. ఆపిల్ వాచ్ 7 హెచ్చరించడంతో వెంటనే, ఆ అర్ధరాత్రి హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు. సమస్య రాగానే హాస్పిటల్ కు రావడం మంచిదైందని, లేదంటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని వారు చెప్పారు.

టిమ్ కుక్ కు థాంక్స్

ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం మంచిదని భావించిన స్నేహ సిన్హా ముందుగా ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు మెయిల్ చేసింది. ఆపిల్ వాచ్ 7 (Apple watch 7) తన ప్రాణాలకు కాపాడిన విషయాన్ని ఆయనకు వివరించింది. ఆపిల్ వాచ్ లో అక్యురేట్ హార్ట్ రేట్ మానిటర్ ను పొందుపర్చినందుకు కుక్ కు ధన్యవాదాలు తెలిపింది. నిజానికి తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తాను ఫిట్ గా ఉన్నానని ‘హిందుస్తాన్ టైమ్స్ టెక్ (HT Tech)’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. తాను రెగ్యులర్ గా ట్రెకింగ్ కు కూడా వెళ్తుంటానని, ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండే 15,000-16,000 అడుగుల ఎత్తులో ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేశానని వెల్లడించింది.

టెక్నాలజీ అద్భుతం

ఈ మధ్య కాలంలో ఇండియాలో ఆరోగ్యవంతులైన, ఫిట్ గా ఉండే వారు కూడా అకస్మాత్తుగా గుండెజబ్బులు బారిన పడుతున్న సంఘటనలు చాలానే పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. అందుకే స్నేహ తన కథను అందరికీ చెప్పడం ముఖ్యమని భావించింది. ‘‘ఆ రాత్రి, నా హృదయ స్పందన రేటు (heart rate) 250 కి పెరిగింది. అదృష్టవశాత్తూ, నా ఆపిల్ వాచ్ నన్ను సకాలంలో అప్రమత్తం చేసింది. నన్ను అత్యవసర గదికి తరలించే వరకు నా గుండె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించింది’’ అని స్నేహ చెప్పారు. ‘‘గిఫ్ట్ గా పొందిన ఆపిల్ వాచ్ 7 నా మణికట్టుపై సంరక్షక దేవదూతగా మారుతుందని, చివరికి నా ప్రాణాలను కాపాడుతుందని నాకు తెలియదు’’ అని ఆమె చెప్పారు.

ఈసీజీతో సమస్య తెలిసింది

"నేను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, గుండె దడను గమనించాను. దానిని పర్యవేక్షించడానికి నా ఆపిల్ వాచ్ ను ఉపయోగించాను. పదేపదే అధిక హృదయ స్పందన రేటును చూపించినప్పటికీ, మొదట్లో నేను సీరియస్ గా తీసుకోలేదు. ఈ పరిస్థితి 1.5 గంటలకు పైగా కొనసాగింది. ఈసీజీ ఏట్రియల్ ఫైబ్రిలేషన్ (AFib) ప్రారంభాన్ని, ట్రాకీకార్డియా సమస్యను సూచించింది. దాంతో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక ఫ్రెండ్ కు కాల్ చేసి, వెంటనే వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లానని కోరాను’’ అని ఆమె వివరించారు.

టిమ్ కుక్ కు ఈ మెయిల్

మొత్తం ఎపిసోడ్ తరువాత, స్నేహ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook), ఆపిల్ వాచ్ (Apple watch) బృందాన్ని సంప్రదించాలని నిర్ణయించుకుంది. "ఇంత ఖచ్చితమైన మరియు అధునాతన గుండె పర్యవేక్షణ లక్షణాలను అభివృద్ధి చేసినందుకు నేను నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను. ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు ప్రాణాలను ఎలా కాపాడవచ్చో ఆపిల్ వాచ్ నిరూపించింది. ఇంటర్నెట్ లో టిమ్ కుక్ ఈమెయిల్ అడ్రస్ దొరికింది’’ అని స్నేహ వివరించింది. "నేను టిమ్ తో నా కథను పంచుకున్న తర్వాత, కొన్ని గంటల్లోనే అతను స్పందించాడు. ‘‘మీరు వైద్య సహాయం పొందడం, మీకు అవసరమైన చికిత్స లభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ కథను మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు' అని టిమ్ కుక్ (Tim Cook) రిప్లై ఇచ్చారు.

WhatsApp channel