2024 మచ్ అవైటెడ్ ఈవెంట్‌కి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 9న జరగనున్న ‘గ్లోటైమ్’ ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్‌ని యాపిల్ సంస్థ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో పాటు పలు ఆసక్తికర గ్యాడ్జెట్స్‌పై ఈ ఈవెంట్లో ప్రకటన వెలువడుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న యాపిల్ ఈవెంట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కోసం 'గ్లోటైమ్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని యాపిల్ నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే కాలిఫోర్నియాలోని యాపిల్ కుపర్టినో పార్క్‌లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఉదయం 10 గంటలకు (ఈటీ మధ్యాహ్నం 1 గంటలకు) ప్రారంభమవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 నిమిషాలు.
మీరు యాపిల్ వెబ్సైట్, యాపిల్ యూట్యూబ్ ఛానెల్ లేదా యాపిల్ టీవీ యాప్ ద్వారా ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
సెప్టెంబర్ 9న 'గ్లోటైమ్' స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు యాపిల్ సంస్థ ఇటీవలే ప్రకటించినప్పటి నుంచి ఔత్సాహికుల్లో ఆసక్తి, ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ ఈవెంట్లో టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 10ని విడుదల చేసే అవకాశం ఉంది. యాపిల్ తన రాబోయే సాఫ్ట్వేర్ అప్డేట్ల విడుదల తేదీలను కూడా ఈ ఈవెంట్లో వెల్లడించే అవకాశం ఉంది. వీటిలో ఐఓఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, టీవీఓఎస్ 18, వాచ్ఓఎస్ 11, విజన్ఓఎస్ 2, మాక్ఓఎస్ సెకోయా ఉన్నాయి.
సెప్టెంబర్ 9న జరిగే గ్లోటైమ్ ఈవెంట్లో యాపిల్ చీఫ్ టిమ్ కుక్ నాలుగు కొత్త ఐఫోన్ డివైజ్‌లను ఆవిష్కరించే అవకాశం ఉంది. అవి.. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.
ముఖ్యంగా, రాబోయే ఐఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌పై యాపిల్ చాలా మౌనన్ని పాటిస్తున్నప్పటికీ, పుకార్లు- లీకులు లాంచ్ చేయబోయే పరికరాల గురించి చాలా వివరాలను వెల్లడించాయి.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం యాపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను భారతదేశంలో తయారు చేయనుంది. అందువల్ల, దేశంలో ఈ పరికరాల రిటైల్ ధర తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి.
ప్రీమియం ఐఫోన్ మోడళ్ల స్థానిక అసెంబ్లింగ్ కొత్త ఐఫోన్ 16 ప్రో మోడళ్లకు కనీసం 10 శాతం వరకు ధర తగ్గింపునకు వెసులుబాటును కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు.