Apple Jobs : యాపిల్ నుంచి భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలు.. 70 శాతం మహిళలకు ప్రయోజనం
Apple Company Jobs : భారతదేశంలో యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగా చాలా ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
భారతదేశంలో తన ఉత్పత్తి బేస్ విస్తరించడం ద్వారా యాపిల్ కంపెనీ 600000 ఉద్యోగాలను సృష్టించగలదని, ఇందులో 70 శాతం మంది మహిళలు ఉంటారని నివేదిక తెలిపింది. చైనా నుంచి యాపిల్ వైదొలగడం, భారత్‌లో ఉత్పత్తి, వ్యాపారాన్ని పెంచడం వల్ల ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, భారతదేశంలో తన ఉత్పత్తి బేస్‌ను విస్తరించేందుకు యాపిల్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి యాపిల్ దాదాపు రెండు లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని నివేదిక తెలిపింది. అంచనాల ప్రకారం ప్రత్యక్ష, పరోక్ష ఉపాధితో కనీసం మొత్తం 5-6 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలుస్తోంది. యాపిల్ తన రాబోయే ఐఫోన్ 16 సిరీస్ హై-ఎండ్ ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను మొదటిసారిగా భారతదేశంలో అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తున్నట్లు చెబుతన్నారు.
తమిళనాడులోని యాపిల్‌కు చెందిన శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో తన భాగస్వామి ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్ ద్వారా ఉత్పత్తి చేయనుంది. బ్లూమ్‌బర్గ్ న్యూస్ ప్రకారం, తమిళనాడులోని తన కర్మాగారంలో వేలాది మంది ఉద్యోగులకు కంపెనీ శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది.
యాపిల్ 'ఇట్స్ గ్లోవ్‌టైమ్' అనే ట్యాగ్‌లైన్‌తో సెప్టెంబర్ 9న ఓ ఈవెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో నాలుగు కొత్త ఐఫోన్ 16 మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల యాపిల్ తన మొదటి మ్యాక్ అభివృద్ధిని వేగవంతం చేస్తోందని, దీనిని మొదట తాజా ఐప్యాడ్ ప్రోతో ప్రవేశపెట్టిన ఎం4 చిప్‌ను కలిగి ఉందని అంటున్నారు. రాబోయే లైనప్‌లో మ్యాక్‌బుక్ బ్రో, మ్యాక్ మినీ, ఐమ్యాక్ తాజా వెర్షన్‌లు ఉంటాయని భావిస్తున్నారు, వీటన్నింటిలో ఎం4 చిప్ ఉంటుంది.