8th Pay Commission: 2026 జనవరి 1 నాటికి 8వ వేతన సంఘం ఏర్పాటయ్యే అవకాశం ఉందన్న వార్తలు అధికార వర్గాల నుంచి వస్తున్నాయి. 8వ వేతన సంఘం సిఫారసులతో జీత భత్యాల్లో గణనీయ పెరుగుదల ఉంటుందని దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. 8 వ వేతన సంఘం పరిగణనలోకి తీసుకోవాల్సిన పలు అంశాలను ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు తెర ముందుకు తీసుకువచ్చాయి. 8వ పే కమిషన్ తో జీతాలు, పెన్షన్ ప్రయోజనాలను భారీగా సవరిస్తారన్న వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు.
ప్రభుత్వం సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తుంది. 2016 జనవరి 1 నుంచి 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. 7వ వేతన సంఘం వేతన సవరణ విషయంలో 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వం మాత్రం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను నిర్ణయించింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది జీతాలు, పెన్షన్లను లెక్కించడానికి ఉపయోగించే కీలక గుణకం.
7వ పే కమిషన్ (pay commission) తో కనీస మూలవేతనం నెలకు రూ.18,000 కు పెరిగింది. ఆరో వేతన సంఘంలో ఇది రూ.7,000గా ఉంది. 7వ వేతన సంఘంతో కనీస పెన్షన్ కూడా రూ.3,500 నుంచి రూ.9,000కు పెరిగింది. అలాగే, గరిష్ట వేతనం రూ.2,50,000 లకు, గరిష్ట పెన్షన్ రూ.1,25,000 లకు పెరిగింది.
కొన్ని నివేదికల ఆధారంగా 8వ వేతన సంఘానికి 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కనీస వేతనం, కనీస పెన్షన్ లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం కనీస వేతనం రూ.18,000 కాగా, 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తీసుకుంటే రూ.34,560 కి సవరించవచ్చు. అదే విధంగా కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న రూ. 9 వేల నుంచి రూ.17,280 కు పెరుగుతుంది.