TSRTC PRC : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, 21 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటన
TSRTC PRC : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించారు.
TSRTC PRC : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ (TSRTC PRC)ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్ తో ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల అదనపు భారం పడనుందన్నారు. పీఆర్సీ ప్రకటనతో 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు.
జూన్ 1 నుంచి పీఆర్సీ అమలు
మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ బస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నామన్నారు. 2017లో అప్పటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ సిబ్బందికి 16 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ(PRC) ఇచ్చిందన్నారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నూతన పీఆర్సీ ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందన్నారు. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు(Pay Scale) అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పీఆర్సీ ప్రకటనతో ప్రభుత్వ ఖజానాపై ఏటా 418.11 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని(Mahalakshmi Scheme) అమలు చేశామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఆటో కార్మికులను ఆదుకుంటాం
పేద ప్రజలకు ప్రయాణం కోసమే ఆర్టీసీ నడుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బస్సుల రంగులు వేసి నడపుతున్నామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులకు కొంత అన్యాయం జరిగిందన్న మంత్రి... వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఆటో కార్మికులకు ఇవ్వలేదన్నారు. కానీ మమ్మల్ని ఆటో కార్మికులకు(Auto Workers) రూ.15 వేలు ఇవ్వాలని అంటున్నారన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 3 నెలల్లో 25 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారని తెలిపారు. అందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపాలయన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను వాడుకున్నారని ఆరోపించారు. బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి ప్రాఫిట్ ఒరిఎంటేషన్ వైపుగా తీసుకెళ్తున్నామన్నారు.
సంబంధిత కథనం