TSRTC AC Bus Discounts : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఏసీ బస్సుల టికెట్లపై 10 శాతం డిస్కౌంట్
TSRTC AC Bus Discounts : దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది.
TSRTC AC Bus Discounts : టీఎస్ఆర్టీసీ(TSRTC) ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం లహరి ఏసీ స్లీపర్(Lahari AC Sleeper), ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను కల్పించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ(Discounts) వర్తిస్తుందని ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు డిస్కౌంట్ అమల్లో ఉంటుందని వెల్లడించింది. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరిఖని-బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి, నిజామాబాద్ -బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది.
నిర్మల్ డిపో నుంచి లహరి సేవలు
దూర ప్రాంత ప్రయాణాల్లో సౌకర్యం కోరుకునే వారికి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ లహరి సర్వీసులు వరంగా మారుతున్నాయి. సుఖ ప్రయాణాన్ని కోరుకునే వారు ఇప్పటి వరకు ప్రైవేట్ సర్వీసుల్ని ఆశ్రయిస్తున్నారు. దూరప్రాంత ప్రయాణాలకు ఇన్నాళ్లు ప్రైవేటు సర్వీసులను ఆశ్రయించిన వారిని ఆకట్టుకునేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవట్ సర్వీసుల్లో ఏసీ, నాస్ఏసీ విభాగాల్లో స్లీపర్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకు రావడంతో ఎక్కువ మంది వాటిని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సైతం ఈ మార్పును అందిపు చ్చుకోవాలని, ప్రయాణికులకు మరింత మెరు గైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పెద్ద డిపోగా పేరున్న నిర్మల్ కూడా ఇందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తుంది.
అధికారుల చొరవతో నిర్మల్ డిపోలో మొత్తం 10 ఆధునిక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కుదుపులు లేని ప్రయాణం లహరి.. పేరిట తీసుకొచ్చిన ఈ స్లీపర్ కోచ్ బస్సులు ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభూతినిస్తుంది. 2 ఏసీ, 8 నాన్ ఏసీ లహరి బస్సులు ఇప్పటికే నిర్మల్ డిపోకు చేరుకున్నాయి. ఏసీ బస్సులను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సర్వీసులకు వినియోగిస్తున్నారు. నాన్ ఏసీ బస్సులను విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కనిగిరి, పామూరు, వింజమూరు, కందుకూరు ప్రాంతాలకు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ ప్రాంతంలో ఆంధ్రా నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీరిలో చాలా మంది ప్రయాణంలో సౌఖ్యం కోసం ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సులను ఆశ్రయించే వారు. ఇప్పుడా ఆ అవసరం లేకుండా ఆర్టీసీనే ఆధునిక బస్సులను నడుపుతోంది.
ఆధునిక పరిజ్ఞానంతో తయారైన ఈ సర్వీసుల్లో ఎలాంటి కుదుపుల్లేకుండా ఆహ్లాదకర ప్రయాణం అనుభూతి చెందొచ్చు. ఈ బస్సుల్లో 47 సీట్లుంటాయి. ఇందులో 32 సీట్లు కూర్చొని ప్రయాణించేందుకు కాగా, మిగతావి పడుకునేందుకు బెర్తుల్లాగా ఉంటాయి. బస్సు ఎక్కడ ఆగిందో తెలిపేలా స్పీకర్ అనౌన్స్మెంట్ వస్తుంది. బస్సులో రివర్స్ కెమెరాతో పాటు లోపల కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
సంబంధిత కథనం