Eluru District : భర్త, కుమారులు మృతి...! జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య
ఏలూరు జిల్లాలో విషాదం ఘటన చోటు చేసుకుంది. పందెం కోళ్లకు ఈత నేర్పించే క్రమంలో కాలువలో జారి భర్త, ఇద్దరు కుమారులు ఇటీవలే మృతి చెందారు. దీన్ని జీర్ణించుకోలేక తాజాగా భార్య ఆత్మహత్య చేసుకుంది. వారు లేని ఈలోకంలో తానుండలేనని భావించి తనువు చాలించింది.
తన కుటుంబమే లోకమని భావించి, కంటికి రెప్పలా చూసుకునే భర్త, కలువల్లాంటి బిడ్డలతో అన్యోన్యంగా జీవించే కుటుంబమది. చేతికి అందివస్తున్న పిల్లలను చూసి మురిసిపోయేవారు. ఆ చిన్న కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో, నిర్దాక్షిణ్యంగా చిన్నాభిన్నం చేసింది. పందెం కోడికి ఈత నేర్పించడానికి కాలువలోకి దిగిన భర్త, ఇద్దరు పిల్లలు జలసమాధి అయ్యారు. దీంతో తల్లడిల్లిపోయిన ఆ ఇల్లాలు ఇంట్లోనే ఉరేసుకొని తనువు చాలించింది.
ఈ హృదయ విషాదకర ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో చోటు చేసుకుంది. కవ్వకుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (45), దేవి (36) కుటుంబం పందెం కోళ్లను పెంచి అమ్ముతూ జీవనం సాగిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు మణికంఠ (15), సాయి కుమార్ (13) ఉన్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో పందెం కోళ్లను పెంచుతున్నారు. వాటికి శిక్షణలో భాగంగా ఈతకు తీసుకెళ్తారు. దీంతో తండ్రి వెంకటేశ్వరరావు, కుమారులు మణికంఠ, సాయి కుమార్ ముగ్గురూ కలిసి బుధవారం పందెం కోడితో ఈత కొట్టించడానికి పోలవరం కుడి కాలువకు వెళ్లారు.
కాలువలో ఇద్దరు కుమారులు ఒకరి తరువాత ఒకరు దిగి, ప్రమాదవశాత్తు కాలు జారి కొట్టుకుపోయారు. వీరిని కాపాడేందుకు కాలువలోకి దిగిన వెంకటేశ్వరరావు కూడా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అయితే ముగ్గురికీ ఈత రాకపోవడంతో కాలువలో ముగినిపోయారు. అయితే ఇది గమనించిన స్థానికులు హుటాహుటి చేరుకునే లోపే వారు మరణించారు. రెస్క్యూ బృందం, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి, మృత దేహాలను బయటకు తీశారు. దీంతో పండగ సమయంలో కవ్వకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. భర్త, ఇద్దరు కుమారులు విగతజీవుల్లా కళ్లముందు కనిపించడంతో భార్య దేవి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
భరించలేక భార్య సూసైడ్…!
భర్త, కుమారుల మృతదేహాలకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి, గ్రామానికి తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే భర్త, కుమారులు ఒకేసారి అకాల మరణంతో దూరం కావడాన్ని భార్య దేవి భరించలేకపోయింది. వారినే తలచుకుంటూ రెండు రోజులుగా తీవ్ర మానిసక వేదనకు గురైంది. దీంతో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరుగుదొడ్డిలో ఇనుప రాడ్డుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కట్టుకున్నవాడు, కన్నవారు లేనప్పుడు, తానుండి ఏం ప్రయోజనమని భావించి ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే మరుగుదొడ్డి లోపలికి వెళ్లిన దేవి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూశారు. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పెదవేగి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఒకే కుటుంబంలో నాలుగు చనిపోవడంతో ఆ గ్రామాన్ని విషాదం వీడలేదు. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం