Swarupananda Issue: విశాఖ శారదా పీఠం స్వామిజీ ఆగ్రహానికి కారణం ఏమిటి?-what is the secret behind the words of swarupananda president of visakha sarada math ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Swarupananda Issue: విశాఖ శారదా పీఠం స్వామిజీ ఆగ్రహానికి కారణం ఏమిటి?

Swarupananda Issue: విశాఖ శారదా పీఠం స్వామిజీ ఆగ్రహానికి కారణం ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Apr 24, 2023 09:53 AM IST

Swarupananda Issue: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆగ్రహానికి అసలు కారణం ఏమిటి.. చందనోత్సవం సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వెనుక మర్మం ఏమిటి..?

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ

Swarupananda Issue: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పీఠాధిపతుల కంటే ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల యాగాన్ని నిర్వమించడం ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకొస్తారని కూడా ఆయన శిష్యులు ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే శారదాపీఠానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శారదా పీఠాధిపతికి ఏకంగా ప్రోటోకాల్ కూడా కల్పించింది. అయితే సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా స్వరూపానంద స్వామి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం చర్చనీయాంశంగా మారింది.

ఏం జరిగిందంటే…..

ఆదివారం సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా దర్శనాల కోసం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో సామాన్య భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోడానికి నరకం కనిపించింది. అంతరాలయ దర్శనాలతో సాధారణ భక్తులు విలవిలలాడిపోయారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన శారదా పీఠాధిపతి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింహాచలం చరిత్రలో దుర్మార్గమైన రోజని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని శారదా పీఠాధిపతి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పన్న దర్శనానికి తాను ఎందుకు వచ్చానా అనిపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

"గతంలో చందనోత్సవ నిర్వహణపై తన సలహాలు అడిగేవారని, ఈ సంవత్సరం అధికారులెవరూ తనను సంప్రదించలేదని... అంతా అధికారులు, పోలీసుల ఇష్టారాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. భక్తులకు చేరువగా భగవంతుడు ఉండేలా ఇక్కడ ఏర్పాట్లు చేయలేదన్నారు. ఆరు నెలలకు పైగా సింహాచలం దేవస్థానానికి ఈవో లేకుండా ఇన్‌ఛార్జితో నడుపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో విశ్వసించే అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో వచ్చారన్నారు. పోలీసులతో వీఐపీ టికెట్లు అమ్మించారని, వారు ఎవరెవరికి అమ్మారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. భక్తులపై ఏమాత్రం కనికరం లేకుండా యంత్రాంగం ఇష్టారీతిన వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భాలయాన్ని చూస్తే భయం వేసిందని, పోలీసులు, జనాలతో ఏమాత్రం ఆచారం, మడి లేకుండా పోయాయని, చాలా దారుణమని అభిప్రాయపడ్డారు.

చిన్న పిల్లలతో వచ్చిన భక్తులు కొండ కింది వరకు ఉన్నారని, అసలు క్యూలైన్లలో కదలికే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పన్న పేదల దేవుడని, వీఐపీ దర్శనాలకు ప్రాధాన్యం కల్పించి పేదలకు భగవంతుడిని దూరం చేయడం సరికాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

స్వామి వారి అక్రోశానికి కారణం అదేనా….

విశాఖ శారదా పీఠాధిపతి అక్రోశానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా మునుపటి ప్రాధాన్యత లభించడం లేదనే భావన శారదా పీఠాధిపతిలో ఉందని ప్రచారం జరుగుతంది. 2017-18 నుంచి ఏటా విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి వీలైనపుడల్లా హాజరవుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తరచూ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు.

ముఖ్యమంత్రిని శారదా పీఠానికి దగ్గర చేయడంలో సిఎంఓలో ఉన్న కొంతమంది కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు మతపరమైన అంశాలతో రాజకీయం నడిచింది. ముఖ్యమంత్రి సైతం హిందు మత విశ్వాసాలపై తనకు నమ్మకం ఉందని పలు సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో స్వామిజీలు, పీఠాధిపతులతో అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఎక్కువగా సమావేశం అయ్యేవారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో దాడులు జరిగిన సమయంలో హిందు మత విశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో 2019కు ముందు ధ్వంసమైన ఆలయాలను పునర్నిర్మించే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

మరోవైపు విశాఖ శారదాపీఠానికి ప్రాధాన్యత ఇవ్వడం మిగిలిన హిందు ధార్మిక సంస్థల్లో అసంతృప్తి నెలకొంది. వీటిని కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో విశాఖ జిల్లా కలెక్టర్‌గా వెళ్లిన మల్లిఖార్జున విధుల్లో చేరిన తర్వాత శారదా పీఠాధిపతిని సంప్రదించకపోవడం ఆయనకు ఆగ్రహం కలిగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు గతంలో మాదిరి ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడం కూడా స్వామిజీకి ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి హాజరవుతారని కొద్ది నెలల క్రితం విస్తృత ప్రచారం జరిగంది.

ముఖ‌్యమంత్రి రాక సందర్భంగా శారదా పీఠం పరిసర ప్రాంతాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి పర్యటనకు కొద్ది గంట ముందు అనూహ్యంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి విశాఖ వెళ్లకపోవడం కూడా స్వామిజీ అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. శారదా పీఠం నుంచి చేసిన సిఫార్సులను సిఎంఓ అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. గతంలో మాదిరి అధికార వర్గాల్లో ప్రాధాన్యత, స్పందన లభించకపోవడంతోనే చందనోత్సవం సందర్భంగా ఆ అక్కసు బయటపెట్టారని ప్రచారం జరుగుతోంది.

పబ్లిక్‌గా విమర్శించి వీడియోలో వివరణ….

మరోవైపు చందనోత్సవ ఏర్పాట్లపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన శారదా పీఠాధిపతి ఆ తర్వాత మరో వీడియోలో వివరణ ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనీ, తప్పంతా అధికారులదే అని అందులో వివరణ ఇచ్చారు. 'చందనోత్సవం నిర్వహణలో వైఫల్యానికి కారణం అధికారులు, పోలీసులే అని, పెద్ద క్షేత్రాన్ని ఇన్‌ఛార్జితో నడపడం తప్పని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తప్పు పట్టాలన్నది తన ఉద్దేశం కాదని, అధికారులను ప్రభుత్వం నియమిస్తుందని, వారు చిత్తశుద్ధితో పనిచేయాలని, వారి తప్పిదం వల్ల భక్తుల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు సంక్షేమం విషయంలో చాలా చక్కగా, నిస్వార్థంగా పనిచేయడాన్ని అభినందిస్తున్నానని, దేవాదాయశాఖ పరిస్థితే బాగోలేదని, అధికారులు సరిగా పనిచేయడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనే కొండపై అలా మాట్లాడానని చెప్పారు.

Whats_app_banner