Pawan Kalyan : జగన్‌ను అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది - పవన్ కల్యాణ్-visakhapatnam gajuwaka janasena varahi yatra pawan kalyan sensational comments on ysrcp mps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : జగన్‌ను అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది - పవన్ కల్యాణ్

Pawan Kalyan : జగన్‌ను అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది - పవన్ కల్యాణ్

Bandaru Satyaprasad HT Telugu
Aug 13, 2023 09:14 PM IST

Pawan Kalyan : పోరాటం ఎలా చేయాలో తనకు ఉత్తరాంధ్ర నేర్పిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ కోసం దిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటానన్నారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : గాజువాకలో ప్రజాదరణను చూస్తుంటే ఇక్కడ తాను ఓడిపోయినట్లు లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం గాజువాకలో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. పోరాటం ఎలా చేయాలో తనకు ఉత్తరాంధ్ర నేర్పించిందన్నారు. తనను ఓడించిన గాజువాక ప్రజల ముందుకు వెళ్తే మళ్లీ ఆదరిస్తారా అని సందేహం వచ్చిందని, కానీ ఇక్కడ ఘనస్వాగతం పలికారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఏ ఉద్దేశంతో ఉన్నానో, ఈరోజు అదే ఉద్దేశంలో గాజువాక వచ్చానని అన్నారు. ఓ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెలియదన్నారు.

దిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటా

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎంతో మంది బలిదానాలతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుర్తుచేశారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం 26 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ఉక్కు కర్మాగారానికి భూమి ఇచ్చిన వారిలో ఇంకా సగం మందికి పరిహారం అందలేదన్నారు. ప్రజల కోసం నిలబడలేని వాళ్లు రాజకీయాల్లోకి రావొద్దన్నారు. 2018లో స్థానిక వైసీపీ ఎంపీపై రౌడీషీట్‌ ఉందన్నారు. ఇలాంటి వారిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడతారా? అని ప్రశ్నించారు. తనపై కేసులున్న వారికి ఎలాంటి ధైర్యం ఉందని, ప్రజా సమస్యలపై పోరాటం చేయరన్నారు. వైసీపీ ఎంపీలకు పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకునే దమ్ముందా? అని నిలదీశారు. నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడేవారికే ధైర్యం ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ కోసం దిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటానని పవన్ అన్నారు. ఆంధ్రా ఎంపీలు దోపిడీలు చేసి ఎంపీలు అయ్యారని కేంద్రంలోని పెద్దలకు తెలుసన్నారు.

రుషికొండపై దేవుడు ఉండాలి, నేరగాళ్లు కాదు

విశాఖ ఎంపీ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే నష్టపోతారని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ప్రజలను దోచుకునేందుకే ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ అయ్యారన్నారు. రుషికొండలో వాల్టా చట్టానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. రుషికొండపై దేవుడు ఉండాలి కానీ, నేరగాళ్లు కాదన్నారు. జగన్‌ను దేవుడు అనుకుని మొక్కితే దెయ్యం అయ్యారన్నారు. జగన్‌ను అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాక్కెళ్లిందన్నారు. జగన్‌ను మరోసారి సీఎంగా భరించలేమన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు కానీ జగన్‌ ప్రభుత్వం మాత్రం రాకూడదని పవన్‌ కల్యాణ్ అన్నారు.

రౌడీషీటర్ ను ఎన్నుకున్నారు

జగన్ లాంటి వ్యక్తి దోపిడీలు చేస్తాడని తెలిసి కూడా 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారని పవన్ కల్యాణ్ అన్నారు. భవన నిర్మాణ కార్మికులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారని, 3 నెలల్లోనే 30 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మనం చేసే మంచి గుర్తించి జనం వస్తారని పవన్ అన్నారు. తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నచోటుకు మళ్లీ వచ్చానన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదని పవన్ అన్నారు. ఎంతో మంది బలిదానాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ దక్కితే, సీఎం జగన్ మాత్రం ఒక్కమాట కూడా మాట్లడడంలేదన్నారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లోనూ భారీగా సీట్లు ఉన్న వైసీపీ తమకు ప్రజల సమస్యలు పట్టవన్నట్లు ప్రవర్తిస్తుందని విమర్శించారు. జనసేనకు ఒక్క ఎంపీ సీటు ఇచ్చి ఉంటే పార్లమెంట్ లో ప్రజల గళం వినిపించే వాళ్లమన్నారు. విశాఖ ప్రజలు రౌడీ షీటర్ ను ఎన్నుకుంటే, ఆ రౌడీ ఎంపీ ప్రజల కోసం ఎందుకు నిలబడతారన్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం రాజీపడిందన్నారు.

Whats_app_banner