Tiurmala : టీటీడీ అలర్ట్.. ఈనెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. నవంబరులో తిరుమలలో విశేష పర్వదినాలు
Tiurmala : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనుంది. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 30వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
ఈనెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది. దీనికి సంబంధించి 30వ తేదీ బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
విశేష పర్వదినాలు..
తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర నిర్వహించనున్నారు.
నవంబరు 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, నవంబరు 12న ప్రబోధన ఏకాదశి, నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, నవంబరు 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి విశేష పర్వదినాలు జరగనున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
టోకెన్లు ఇచ్చే ప్రాంతాలు..
తిరుపతిలో ప్రతిరోజూ ఉదయం 2 గంటల నుండి ఉచిత దర్శనం టోకెన్లు (ఎస్ఎస్‌డీ టోకెన్స్) శ్రీనివాసం కాంప్లెక్స్ - తిరుపతి ఆర్‌టీసీ బస్టాండ్ దగ్గర (Location: https://g.co/kgs/sGLmzoE), విష్ణు నివాసం - తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా (Location: https://g.co/kgs/1JmTjmd), భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి, తిరుపతి (Location: https://g.co/kgs/Ps7bqWp) ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఉదయం 5.30 లేదా 6.00 నుండి నడకదారిలో 50వ మెట్టు దగ్గర దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు. 1,200వ మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకుని తిరుమల చేరుకోవాలి (Location: https://maps.app.goo.gl/tVtpeogWgaMALH2Q9)
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)