Vijayawada : త్యాగం, రాజీలేని పోరాటం లెనిన్ జీవితంలో ముఖ్య భాగాలు- విజయవాడలో లెనిన్ శత వర్ధంతి సభలో నేతల కీలక వ్యాఖ్యలు-vijayawada lenin centenary death anniversary event held new socialist praxis leaders spoke ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : త్యాగం, రాజీలేని పోరాటం లెనిన్ జీవితంలో ముఖ్య భాగాలు- విజయవాడలో లెనిన్ శత వర్ధంతి సభలో నేతల కీలక వ్యాఖ్యలు

Vijayawada : త్యాగం, రాజీలేని పోరాటం లెనిన్ జీవితంలో ముఖ్య భాగాలు- విజయవాడలో లెనిన్ శత వర్ధంతి సభలో నేతల కీలక వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Nov 10, 2024 10:13 PM IST

Vijayawada News : ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించిన మొదటి వ్యక్తి లెనిన్ అని న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ నేతలు అన్నారు. విజయవాడలో లెనిన్ శత వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నేతల కీలక ప్రసంగం చేశారు.

త్యాగం, రాజీలేని పోరాటం లెనిన్ జీవితంలో ముఖ్య భాగాలు
త్యాగం, రాజీలేని పోరాటం లెనిన్ జీవితంలో ముఖ్య భాగాలు

రష్యా సోషలిస్టు విప్లవ వార్షికోత్సవం, లెనిన్ శత వర్ధంతి సందర్భంగా న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ ఇవాళ సదస్సు నిర్వహించింది. వంద మందికి పైగా పాల్గొన్న ఈ సదస్సు విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. కామ్రేడ్ ఆర్. రఘు (న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్) సభకు అధ్యక్షత వహించగా, వక్తలు బిపిన్ బలరామ్ (మార్క్స్ సర్కిల్, కేరళ), జయప్రకాష్ (న్యూ సోష్అలిస్టి ప్రాక్సిస్), డా. ఎస్. సురేష్ (న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్) మార్క్సిస్టు సిద్ధాంతానికి, ఆచరణకి లెనిన్ చేసిన కృషిని గురించి చర్చించారు.

ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించగలిగిన సిద్ధాంతాన్ని మార్క్స్, ఎంగెల్స్‌లు రూపొందించారు. ఆచరణలో ఇటువంటి సమాజ నిర్మాణాన్ని నిజం చేసిన మొదటి వ్యక్తి లెనిన్ అని బిపిన్ అన్నారు. మార్క్సు చెప్పిన భావాలను వల్లె వేయడం కాకుండా మారుతున్న పరిస్థితులను మార్క్సిజం వెలుగులో సరిగ్గా విశ్లేషించి, ఆ ఫలితాలను సృజనాత్మకంగా ఆచరణలో పెట్టారన్నారు. విప్లవ లక్ష్యాన్ని ఏనాడూ వదలకపోవడం లెనినిజం ప్రత్యేకత అని, అది ఏనాడో జరిగే పనిగా కాక, నేడు మనం చేసే ప్రతి పని విప్లవానికి ఉపయోగపడేదిగా ఉండాలన్నది లెనిన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అన్నారు. ఏదన్నా సమస్య/వైఫల్యం ఎదురైనప్పుడు నిజమైన శాస్త్రీయ పద్ధతిలో సిద్ధాంత మూలాలలోకి వెళ్లి అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని లెనిన్ కృషి వివరిస్తుందన్నారు. తత్వశాస్త్రంలో లెనిన్ కృషి ఈ విషయాన్నే ప్రతిబింబిస్తుందన్నారు.

జయప్రకాష్ మాట్లాడుతూ... వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ఆచరణ ఫలితాలు నేడు మన ముందు ఉన్నాయని, నేడు కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలను అర్ధం చేసుకోవడానికి భారత కమ్యూనిస్టులు లెనిన్ నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. లెనిన్ రష్యన్ సమాజాన్ని అధ్యయనం చేసి అందులో జరిగిన పెట్టుబడిదారీ అభివృద్ధిని అర్థం చేసుకున్నట్టే భారత కమ్యూనిస్టులు కూడా మారిన పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవాలన్నారు. వ్యవసాయంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ సంబంధాలను గుర్తించాలని, దాని ఆధారంగా సోషలిస్టు విప్లవ లక్ష్యం కోసం పనిచేయాలని అన్నారు. సమాజంలోని వర్గాలను గుర్తించి వర్గ పోరాటం చేయాలని, అయితే ఆ వర్గపోరాట లక్ష్యం శ్రామికవర్గ నియతృత్వంగా ఉన్నప్పుడే అది నిజమైన మార్క్సిస్టు కార్యాచరణ అవుతుందన్నారు. విప్లవాన్ని విజయవంతం చేయడానికి ఒక నూతన లెనినిస్టు పార్టీ అవసరం గురించి జయప్రకాష్ నొక్కి చెప్పారు.

డా. ఎస్. సురేష్ మాట్లాడుతూ... త్యాగం, రాజీలేని పోరాటం లెనిన్ జీవితంలో ముఖ్యమైన భాగాలన్నారు. రష్యాలో సోషలిస్టు ఉద్యమం మూలములుపులో ఉన్న ప్రతీసారి లెనిన్ తన సైద్ధాంతిక పోరాటం ద్వారానే బోల్షెవిక్ పార్టీని, రష్యా విప్లవాన్ని సరైన దిశలో నడపగలిగారు అన్నారు. పార్టీ నిర్మాణం గురించి మెన్షెవిక్కులతో చేసిన పోరాటం అయినా, వామపక్ష అతివాదులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం అయినా, బెర్న్‌స్టీన్ నాయకత్వంలో యూరోపియన్ సోషలిస్ట్ ఉద్యమంలో ముందుకు వచ్చిన రివిజనిజానికి వ్యతిరేకంగా అయినా లెనిన్ చేసిన సైద్ధాంతిక పోరాటాలు స్ఫూర్తిదాయకమని, అన్నారు. సదస్సులో మార్క్సిస్టు సైద్ధాంతిక గ్రంథాలతో ఏర్పాటు చేసిన బుక్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Whats_app_banner