Vijayawada Car Racing : విజయవాడలో లగ్జరీ కార్లతో రేసింగ్, స్కూటీలను ఢీకొట్టి పరారీ- నలుగురికి తీవ్రగాయాలు-vijayawada crime news luxury car racing met accident four severely injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Car Racing : విజయవాడలో లగ్జరీ కార్లతో రేసింగ్, స్కూటీలను ఢీకొట్టి పరారీ- నలుగురికి తీవ్రగాయాలు

Vijayawada Car Racing : విజయవాడలో లగ్జరీ కార్లతో రేసింగ్, స్కూటీలను ఢీకొట్టి పరారీ- నలుగురికి తీవ్రగాయాలు

Bandaru Satyaprasad HT Telugu
Nov 19, 2023 01:44 PM IST

Vijayawada Car Racing : విజయవాడలో కొందరు యువతీ, యువకులు శనివారం అర్ధరాత్రి లగ్జరీ కార్లతో హల్ చల్ చేశారు. కార్లతో రేసింగ్ నిర్వహించారు. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ కారు రెండు స్కూటీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విజయవాడలో కార్ల రేసింగ్
విజయవాడలో కార్ల రేసింగ్ (Unsplash)

Vijayawada Car Racing : విజయవాడలో శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్ కలకలం రేపింది. జాతీయ రహదారిపై బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు రేసింగ్ చేశారు. రేస్ లో అతి వేగంగా వచ్చిన ఓ కారు రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఢీకొట్టింది. దీంతో స్కూటీలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో స్కూటీలు రెండు ముక్కలయ్యాయి. రేసింగ్ పాల్గొన్న కారు ముందు భాగం ధ్వంసం అయింది. ప్రమాదం అనంతరం ఫార్చూనర్‌ కారులోని యువతీ, యువకుడు మరో కారులో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగింది?

విజయవాడ జాతీయ రహదారిపై లగ్జరీ కార్లతో యువతీ, యువకులు రేసింగ్ చేశారు. రేసింగ్ లో పాల్గొ్న్న ఓ కారు రోడ్డుపై వెళ్తున్న రెండు స్కూటీలను ఢీకొట్టింది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. జాతీయ రహదారిపై రేసింగ్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. బెంజి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్‌లో అతి వేగంగా వచ్చిన రెండు కార్లు రోడ్డుపై పలు వాహనాలను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరిపడ్డారు. వారికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లగ్జరీ కార్లలో ప్రయాణిస్తున్న యువతీ, యువకులు రేసింగ్ పెట్టుకుని రోడ్డుపై వాహనాలను ఢీకొట్టారని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో

విజయవాడ బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు మార్గంలో లగ్జరీ కార్లతో రేసింగ్ పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగంగా వచ్చిన ఫార్చునర్ కారు రెండు స్కూటీలను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఫార్చునర్ కారులోని ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఆ కారును అక్కడే వదిలేసి బెంజ్ కారులో పరారయ్యారు. మద్యం మత్తులో ఉన్న యువతీ, యువకులు రేసింగ్ పెట్టుకుని తమ వాహనాలను ఢీకొట్టారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విచారణ వేగవంతం

విజయవాడ లగ్జరీ కార్ల రేసింగ్ ప్రమాదంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రేసింగ్ లో పాల్గొన్న నలుగురు యువతులు, యువకులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎవరెవరు ఇంకా ఈ రేసింగ్ లో ఉన్నారని ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులో రేసింగ్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.