CM Jagan Stone Pelting Case : సీఎం జగన్ పై రాయితో దాడి కేసులో ట్విస్ట్, దుర్గారావు రిలీజ్-A2 ఎవరు?
CM Jagan Stone Pelting Case : సీఎం జగన్ పై దాడి కేసులో అనుమానితుడి ఉన్న టీడీపీ కార్యకర్త దుర్గారావును పోలీసులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. కుటుంబ సభ్యులు, వడ్డెర కాలనీ వాసులు నిరసనలతో....శనివారం రాత్రి దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు.
CM Jagan Stone Pelting Case : సీఎం జగన్ పై రాయితో దాడి కేసు(CM Jagan Stone Pelting Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును...శనివారం రాత్రి విడిచిపెట్టారు. దుర్గారావును తీసుకెళ్లిన పోలీసులు..అరెస్టు చూపించకపోవడంతో.. ఆ తరఫు న్యాయవాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్(Habeas Corpus Petition) దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు దుర్గారావును విడిచిపెట్టారు. దుర్గారావు ఆచూకీ కోసం నాలుగు రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు పోలీసులు చుట్టూ తిరిగారు. విజయవాడ(Vijayawada) సీపీ కార్యాలయం ఎదుట దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెక కాలనీ వాసులు శనివారం ఆందోళన చేశారు. వారిని పోలీసులు బలవంతంగా తరలించారు. ఈ నెల 16న దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది.
సతీష్ వాంగ్మూలం రికార్డుకు పోలీసుల ప్రయత్నం
చివరకు విజయవాడలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి, మళ్లీ విచారణకు పిలిచినప్పుడు హాజరవ్వాలని తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్‌ను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు ముందుగా భావించారు. కానీ ఇప్పుడు మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సతీష్ రాయి విసిరినట్లు చూసిన వాళ్లు లేకపోవడం...సీఆర్పీసీ 164 కింద సతీష్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి వాంగ్మూలం రికార్డు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయి దాడి కేసులో(Stone Pelting Case) నిందితుడు సతీష్ కు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
నా తప్పు లేదని తెలిసి విడిచిపెట్టారు- దుర్గారావు
విడుదల అనంతరం దుర్గారావు మీడియాతో మాట్లాడారు. విచారణలో టీడీపీ నేత బోండా ఉమా (Bonda Uma)చేయమని చెప్పారు కదా అని పోలీసులు ప్రశ్నించారని దుర్గారావు తెలిపారు. సీఎం జగన్ పై దాడికి పాల్పడిన సతీష్ తమ కాలనీలో ఉంటాడు కానీ అతనితో పరిచయంలేదన్నారు. రాయి దాడిలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని చాలా మంది పోలీసులు తనను విచారించారన్నారు. తన ఫోన్ తనిఖీ చేశారని, అయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు దుర్గారావు. టీడీపీలో(TDP) యాక్టివ్ గా ఉన్న కారణంగానే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. మూడు రోజుల పాటు అనేక కోణాల్లో విచారించారని, తన తప్పు లేదని తెలిసి విడిచిపెట్టారన్నారు. ఈ కేసులో ఏ ఆధారం లేకపోవడంతో 164 నోటీసులు ఇచ్చి.. పోలీసులే తనను ఇంటి వద్ద విడిచిపెట్టారన్నారు. తన కుటుంబ సభ్యులుతో సంతకాలు చేయించుకున్నారని దుర్గారావు తెలిపారు.
సీఎం జగన్ పై రాయితో దాడి
విజయవాడలో బస్సు యాత్ర సమయంలో సీఎం జగన్(CM Jagan) పై రాయితో దాడి చేశారు. సీఎం జగన్ నుదిటిపై రాయి బలంగా తగలడంతో గాయమైంది. ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు... చివరకు వడ్డేర కాలనీకి చెందిన సతీష్ ను అరెస్టు చేశారు. అతడే సీఎం జగన్ పై రాయితో దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడు సతీష్ కు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో A2గా టీడీపీ నేతల పేర్లు వినిపించాయి. టీడీపీ కార్యకర్త దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించారు. దుర్గారావు... బోండా ఉమా అనుచరుడు. దీంతో బోండా ఉమా ప్రోద్భలంతోనే దుర్గారావు, సతీష్ తో దాడి చేయించాడన్న ప్రచారం జరిగింది. బోండా ఉమాను అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే దుర్గారావును పోలీసులు విడిచిపెట్టడంతో కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో A2 ఎవరనే ప్రశ్న తలెత్తుతుంది. నిందితుడు ఎవరైనా చెబితే చేశాడా? మరే కారణాలున్నాయో పోలీసులు విచారణలో తేలాల్సిఉంది.
సంబంధిత కథనం