Kodi Kathi Case : హైకోర్టులో సీఎం జగన్ కు ఊరట, కోడికత్తి కేసు విచారణపై స్టే
Kodi Kathi Case : కోడికత్తి కేసులో సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది.
Kodi Kathi Case : వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేసిన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. కోడికత్తి కేసులో లోతైన విచారణ చేయాలని జగన్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులను సీఎం జగన్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ కేసుపై విచారణను ఆరు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
లోతైన దర్యాప్తు కోరుతూ పిటిషన్
విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్రకోణం ఉందని, ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలని జగన్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని ఆరోపించారు. ఈ కేసులో నిందితుడైన శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎయిర్ పోర్టు క్యాంటీన్ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో కుట్ర కోణం తేల్చేందుకు లోతైన దర్యాప్తు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు జులై 25న కొట్టివేయడంతో సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్టైన శ్రీనివాసరావుకు నాలుగేళ్లగా జైలులోనే ఉన్నాడు. ఈ కేసులో కోర్టు అతడికి బెయిల్ నిరాకరించింది. తాజాగా హైకోర్టు ఈ కేసు విచారణపై ఎనిమిది వారాల పాటు స్టే విధించింది.
కుట్రకోణం లేదంటున్న ఎన్ఐఏ
విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్‌పై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేస్తుంది. ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో అభియోగాలు నమోదు చేసిన ఎన్‌ఐఏ కోర్టు, సాక్షుల వాంగ్మూలం నమోదు చేస్తుంది. ఈ కేసును గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ చేశారు. ఇటీవల కేసు విచారణను విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో పాటు నిందితుడు శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖ జైలుకు తరలించారు.