Tirumala Srivani Darshan Tickets : వచ్చే 3 నెలల శ్రీవాణి కోటా టికెట్లు.. దక్కించుకోండిలా
Tirumala Srivani Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది.
Tirumala Srivani Darshan Tickets : తిరుమల ఆలయంలో శ్రీవాణి దర్శన టోకెన్ల ద్వారా శ్రీవారి దర్శనానికి సంబంధించి.. కీలక అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవాణి టికెట్ల కోటా వివరాలను వెల్లడించింది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనున్నామని తెలిపింది. ఈ కోటాను ఫిబ్రవరి 25న శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. రోజుకు 500 టికెట్లు చొప్పున భక్తులకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
ఆఫ్ లైన్ లో శ్రీవాణి టికెట్ల జారీని టీటీడీ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. తిరుమలలోని గోకులం కార్యాలయంలో ఫిబ్రవరి 22 నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లను అందిస్తోంది. ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి నుంచి 1000 శ్రీవాణి టిక్కెట్లలో... 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
ఆన్ లైన్ లో బుకింగ్ ప్రాసెస్….
టికెట్లు బుక్ చేసుకునేందుకు https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డును చూసి.. మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే.. ఖాళీలు ఉంటే.. గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఆ తర్వాత.. అక్కడ నొక్కితే.. టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. బుకింగ్ ప్రక్రియ.. సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధంగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.
టీటీడీ దేవస్థానమ్స్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా వివిధ రకాల సేవా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించింది. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్ ద్వారా క్లౌడ్ టెక్నాలజీని వాడుతున్నారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు.