TTD : భక్తులకు అలర్ట్.. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వర్చువల్ కల్యాణోత్సవం - ఆన్‌లైన్‌లో టికెట్లు
Tiruchanoor Sri Padmavati Ammavaru Temple:భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవంలో భక్తులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
TTD Latest News: భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవంలో భక్తులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది .
రూ.500 చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు టికెట్టు పొందిన తేదీ నుండి 90 రోజులలోపు గృహస్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వీరికి ఒక ఉత్తరియం, రవిక, లడ్డూ, వడ బహుమానంగా అందిస్తారు. సుదూర ప్రాంతాల నుండి తిరుచానూరు వచ్చి అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొన లేని భక్తుల కోసం టీటీడీ వర్చువల్ కల్యాణోత్సవం ప్రవేశపెట్టింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.
వరలక్ష్మీ వ్రతం…
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంఘనంగా నిర్వహించనున్నారు. ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆలయం వద్ద గల కుంకుమార్చన కౌంటర్‌లో ఆగస్టు 24 వ తేదీ ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 18న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్టు 26వ తేదీ నుండి 90 రోజులలోపు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
టీటీడీ పెన్షనర్ల కోసం మొబైల్ యాప్
పెన్షనర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకొచ్చింది టీటీడీ. TTD Pensoner Mobile App పేరుతో రూపొందించిన మొబైల్ యాప్‌ను శుక్రవారం టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
టీటీడీలో 8,120 మంది పెన్షనర్లు ఉన్నారు. పేస్లిప్పులు, వ్యక్తిగత వివరాలు, జీవన్‌ప్రమాణ్ (లైవ్ సర్టిఫికేట్ వివరాలు), పెన్షన్ బెనిఫిట్లు, కుటుంబ సభ్యుల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో యాప్‌స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. టీటీడీ ఐటి విభాగం, అకౌంట్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సిజిజి సర్వీసెస్ వారు ఈ యాప్‌ను రూపకల్పన చేశారు.