Tirupati Laddu : కేజీ ఆవు నెయ్యి రూ. 320కే ఎలా వస్తుంది! ఈ డౌట్ తోనే టెస్టింగ్ చేయించాం - కీలక విషయాలు చెప్పిన TTD ఈవో
తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో కీలక విషయాలు చెప్పారు. తక్కువ రేటుకే నెయ్యిని సప్లై చేస్తున్నారంటేనే అనుమానపడ్డామని అన్నారు. ఈ డౌట్ తోనే శాంపిల్స్ టెస్టుకు పంపామని అన్నారు. ఈ నివేదికలో కల్తీ జరిగినట్లు తేలిందని వెల్లడించారు.
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వులు వాడరంటూ రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఇది మరింత ముదిరింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని భక్తులతో పాటు పలు రాజకీయపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే విషయంపై ఇవాళ టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అన్నారు. లడ్డూ క్వాలిటీ బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలన్నారు. లడ్డూ తయారీకి నాణ్యమైన ఆవు నెయ్యి వాడాల్సి ఉంటుందని చెప్పారు.
టీటీడీకి సొంత టెస్టింగ్ ల్యాబ్ లేదన్న ఆయన…. రూ.75 లక్షల ఖర్చయ్యే ల్యాబ్‌ను ఎందుకు పెట్టలేదో తెలియదని వ్యాఖ్యానించారు. టెస్టింగ్ ల్యాబ్ లేకపోవటమే సరఫరాదారులకు అవకాశంగా మారిందని చెప్పుకొచ్చారు. జంతు కొవ్వు వాడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయని… నెయ్యి నాణ్యత బాగా లేదు అని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.
ఒక కేజీ ఆవు నెయ్యిరూ. 320 నుంచి రూ.411కే మధ్య ఉన్న రేటుకే ఎలా వస్తుందని తమకు అనుమానం వచ్చిందని ఈవో చెప్పారు. నెయ్యి చూస్తే నూనెలాగా ఉండేదని.. ఈ అనుమానంతోనే టెస్టింగ్ చేయించామని వెల్లడించారు. నెయ్యి నాణ్యత నిర్ధరణ కోసం ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపామని చెప్పారు. నెయ్యి నాణ్యత లేదని… కల్తీ జరిగినట్టు నివేదికలు వచ్చాయన్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని తెలిపారు.
విచారణకు సీఎం ఆదేశాలు:
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల భక్తుల ఆవేదన పరిగణలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకంటే ముందు ఇంది మంచి ప్రభుత్వం కార్యక్రంలో మాట్లాడిన చంద్రబాబు… శ్రీవారి ప్రసాదం అంశంపై కూడా స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేశాడని ఆరోపించారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్నారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశాడన్న ఆయన… జగన్ పాలనలో లడ్డూ, అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందని విమర్శించారు.
తాము అధికారంలోకి రాగానే.. తిరుమలలో ప్రక్షాళన మొదలు పెట్టామని చంద్రబాబు చెప్పారు. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదం బాగుందని ఒక్కరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. శ్రీవారి విషయంలో క్షమించరాని నేరం చేశారని… అలాంటి వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. రూ.350 కిలో నెయ్యి వస్తుంటే అనుమానం రాలేదా..? కూటమి ప్రభుత్వం రాగానే.. టీటీడీ ఈవోగా శ్యాములరావును నియమించామన్నారు. శ్రీవారి ప్రసాదం అప్పుడెలా ఉంది.. ఇప్పుడెలా ఉందో అనేది గమనించవచ్చని చెప్పారు.